calender_icon.png 4 August, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమస్ఫూర్తికి ప్రతినిధి దాశరథి

02-08-2025 01:02:13 AM

ఆచార్య మసన చెన్నప్ప :

* దాశరథి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఐనా ఛాదస్తం లేని మహావ్యక్తి వర్తమాన కాలాన్ని తన సూక్ష్మీక్షికతో పరిశీలించి నిదురబోయిన సమాజాన్ని జాగృతం చేసిన క్రాంతదర్శి. దాశరథి మొదట భావకవి, తర్వాత అభ్యుదయ కవి. ఆ తర్వాత ఉద్యమ కవి. క్రమంగా మహాకవిగా, ప్రజాకవిగా సుప్రసిద్ధుడయ్యాడు. 

ఇది మహాకవి దాశరథి శత జయంతి సంవత్సరం. ఒక సంవత్సరం నుంచి ఆయన సాహిత్య సమాలో చనం జరుగుతూ వుంది. నేను హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలలో, తెలంగా ణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సభలో వక్తగా పాల్గొన్నాను. గద్వాలకోటలో మహారాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళా శాల నిర్వహించిన దాశరథి జయంతి సభ లో పాల్గొన్నాను. అట్లే రవీంద్రభారతి ప్రాంగణంలో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ముగింపు సభలో గౌరవ అతిథిగా పాల్గొన్నాను.

సాహిత్య అకాడమీ దాశరథి పేర సాహితీ సప్తాహాన్ని నిర్వహించడం ప్రశంసింపదగిన అంశం. ఈ ఏడు రోజుల్లో దాశరథి సాహిత్యాన్ని ప్రముఖ సాహితీ వేత్తలు స్పృశించి, పరవశించి అద్భుతమైన ప్రసంగాలు చేశారు. దాశరథి కవిత్వం గురించి, సిని మా సాహిత్యం గురించి, నవలా కథా నా టికా సాహిత్యాల గురించి, జీవన నేపథ్యం గురించి చేసిన ప్రసంగాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. నన్ను కూడా స్పందింపజేశాయి. 

ఒక రచయిత సాహిత్య ప్రక్రియలన్నింటిలో ప్రవేశించినా, అతనికి పేరు తెచ్చే ప్రక్రియ ప్రత్యేకంగా ఒకటుంటుంది. కాళిదాసు కావ్యాలు రాశాడు, నాటకాలు రాశాడు. అతడు కవిగానే సుప్రసిద్ధుడు. ఆధునిక యుగం లో విశ్వనాథ సత్యనారాయణ ప్రవేశించని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు. కానీ ఆయనను కవి సామ్రాట్టుగానే లోకం కీర్తిస్తుంది. మహాకవి సి.నారాయణ రెడ్డి ఎన్నో వచన కవితా సంపుటాలను వెలువరించినప్పటికీ, సినీ కవిగానే లోకం గుర్తించింది.

అట్లే దాశరథి కృష్ణమాచార్యులు తెలుగు సాహితీ ప్రక్రియలనెన్నింటినో చేపట్టినప్పటికీ ఆయ నకు ఉద్యమ కవిగానే మనం పరిగణిస్తాం, మహాకవిగానే కీర్తి స్తాం. ‘నా తెంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి. ఆయన రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అనే కవితా సం పుటాలు నా దృష్టిలో షడ్దర్శనాల వంటివి.

దాశరథి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఐనా ఛాదస్తం లేని మహావ్యక్తి వర్తమాన కాలాన్ని తన సూక్ష్మీక్షికతో పరిశీలించి నిదురబోయిన సమాజాన్ని జాగృతం చేసిన క్రాంతదర్శి. దాశరథి మొదట భావకవి, తర్వాత అభ్యుదయ కవి. ఆ తర్వాత ఉద్యమ కవి. క్రమం గా మహాకవిగా, ప్రజాకవిగా సుప్రసిద్ధుడయ్యాడు. నిజాము శాసనంలో తెలంగాణ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులకతడు కంటనీరు పెట్టాడు. ‘ఎవ్వడైనా మానవుడే ఎం దుకు ద్వేషించడాలు?’ అని ప్రశ్నించాడు.

ఆయన భవిష్యద్దర్శనం కవికి మూడో నేత్రం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ‘గతాన్ని కాదనలేను. వర్తమానం వద్దనబోను. భవిష్యత్తును వదులుకోను’ అని చెప్పుకున్న దాశరథి మూడు కాలాలతో తన కవిత్వాన్ని ముడివేసిన వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘నిన్న బాణాలు లేవు, పురాణాలు లేవు సుమా! ఫిరంగి స్వరం లేని చరిత్రంటూ లేదు సుమా!’

‘ఇవాళ రూపాయల మోత లేక రోజంటూ గడవదు, తుపాకుల లేకుండా దొరతనం సాగదు రాజుల మాటే గాని రైతుమాట వినం వినం అణుబాంబుల మాటేగాని మనిషి గూర్చి అనం అనం’ అనే కవితోక్తులను గమనించనప్పుడు ఆయన త్రికాలాలను దర్శించిన తీరు అభివ్యక్తమవుతుంది. దాశరథి ‘తెలుగు ఊరులు, తెలుగు వారలు ప్రతిఫలించే మహా కావ్యం నాకు కావలె’ అని సంకల్పించి, కృతకృత్యుడయ్యాడు.

దాశరథి జీవితమంతా ‘తిమిరంతో సమరం’ చేసిన కవియోధుడు. తెలంగాణ తల్లి పాదపద్మాలకు ‘కవితాపుష్పకం’ సమర్పించాడు. తెలగాణ ‘పునర్నవం’ కోసం తపించాడు. తెలంగాణ కవితా సుందరికి ‘అమృతాభిషేకం’ చేశాడు. తెలంగాణ ప్రజల జవసత్వాలను కొల్లగొట్టిన దుష్టశక్తుల మీద, ‘అగ్నిధార’ కురిపించాడు.

తెలంగాణ అంటే సరిపడని చెవిటిమాలోకం గుండెలదిరి పోయేలాగా ‘రుద్రవీణ’ మ్రోగించాడు. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి పట్టుగొమ్మ ఆయన తెలంగాణయే దాశరథి కవితా వస్తువు. తెలంగాణ ఆయన మాటైంది, పాటైంది, పద్యమైంది, ప్రాణమైంది. ఆయన కవిత్వం నుంచి తెలంగాణను విడదీయలేం.

‘నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి

ఆకాశమంత యెత్తార్చినాను

నేను రాక్షసిగుండె నీరుగా పద్యాలు

పాడి మానవుని కాపాడినాను’ అని దాశరథి లాగా గొంతెత్తి నినందించిన కవి తెలంగాణలో మరొకడు లేడంటే, అది పరమసత్యం. తెలంగాణ ప్రజలను సమైక్య పరుస్తూ ‘మనం ఒక తల్లి పిల్లలం / ఒక తల్లి మల్లెలం / ఒక వాన చినుకులం / ఒక దివ్వె మను కులం’ అని అందరి హృదయాలను తన కవితోక్తులతో ముడివేశాడు. ఆయనవి వట్టి మాటలు కావు, గట్టి చేతలు. ఆయన తెలంగాణ కోసం చేసిన పనులను ప్రతిబింబించే పద్యం ఇది.

‘పాటలు పాడితినే తెలుగు బాబాలు నిద్దుర మేలుకోగ పోరాటము సేయగా, కరకు రాచరికమ్మును కూలద్రోయగా కోటి గళాలనొక్కడ గూర్చితి విప్లవ శంఖమెత్తితిన్ నాటికి నేటికిన్ తెలుగునాటను కాంతి పతాకలెత్తితిన్’ ‘భో షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే; ముసలి  నక్కకు రాచరికంబు దక్కునే’ అన్న దాశరథి మాటలు ఉద్యమశీలుర గుండెల్లో నేటికీ ప్రతిధ్వనిస్తాయి.

దాశరథి కేవలం కవిత్వాన్ని ప్రేమించిన కవి మాత్రమే కాడు. ఆయన తన వాక్కులతో ‘గాయపడిన గుండెల్లో రాయబడని కావ్యాలకు ప్రాణం పోశాడు. దాశరథి కవిగా నిస్వార్థ మానవుని అభ్యుదయాన్ని ఆకాంక్షించాడు. పీడిత ప్రజల మాటలకు తన గొంతును మైకుగా అమర్చినాడు.

అన్యాయం, దౌర్జన్యం, దోపిడీ మొదలైన ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు దోహదపడే ప్రభుత్వాలమీద కవి అన్నవాడు ఏనాటికైనా తిరుగుబాటు చేయవలసిందేనని తన అభిప్రాయాన్ని తిరుగులేని విధంగా తెలియజేశాడు. అందుకే ఆయన ఉద్యమ స్ఫూర్తికి ప్రతినిధి! తెలంగాణ విముక్తికై అక్షర యోధుడై పోరాడాడు.

జైలు పాలయ్యాడు. ఎక్కడున్నా, ఏమి చేసినా తన హృదయం తెలంగాణ చుట్టూ తీగలాగ అల్లుకున్నాడు. ‘హృదయం వినా నా దగ్గర ఏ వస్తువూ లభించదు’ అని తన హృదయం నిండా తెలంగాణా ప్రాభవాన్ని నింపుకున్న ఆ మహాకవికి నా శత జయంతి నివాళి.