02-08-2025 12:58:12 AM
వాచలత్వానికి అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అవార్డు వుంటే అది ఈ ఏడాది ఎవరికి బహూకరించవచ్చు..? తన మాట వినని ప్రపంచ దేశాలపై విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న ఒక దేశాధ్యక్షుడికి ఇవ్వవచ్చు. తప్పా, ఒప్పా అని సరిచూసుకోకుండా సోషల్ మీడియాలో అవాస్తవాలు అలవోకగా ప్రచారం చేయడం ప్రస్తుత అగ్రరాజ్య అధినేతను అంతా కలిసి ఎంపిక చేస్తే ఆ అవార్డుకు వన్నె తెచ్చినట్టే.
పాకిస్థాన్‌లో అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు ఇస్లామాబాద్‌లో కలిసి పని చేయాలని అమెరికా భావిస్తున్నదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా తన మాట పెడచెవిన పెడుతున్నదని అర్థమైన తర్వాత ట్రంప్‌కు ఆ దేశం పేరెత్తితేనే చిర్రెత్తుకొస్తున్నది. రష్యా నుంచి చమురు, ఆయుధాలు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్ కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో కొన్ని అభ్యంతరాలు చెప్పి, కండువా దులిపేయడం కూడా ట్రంప్‌కు చిరాకు కల్గించింది.
ఒక పక్క అమెరికా, భారత్ మధ్య మరో దఫా వాణిజ్య చర్యలకు ఆస్కారం వున్నా, భారత్ 25శాతం దిగుమతి సుంకం, పెనాల్టీలు చెల్లించాల్సిందేనని ట్రంప్ ప్రకటించారు. దీనిపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తుండటం కూడా అమెరికా అధ్యక్షునికి నచ్చలేదు. మీరు నా మాట వినకపోతే, మీ దాయాది దేశంతో వాణిజ్యం చేస్తాం అనే తీరున, పాకిస్థాన్‌లో అపార చమురు నిక్షేపాలున్నాయనే ఓ అవాస్తవాన్ని ట్రంప్ బయటపెట్టారు.
అంతేకాదు, ఏదో ఒక రోజున పాకిస్థాన్, భారత్‌కు చమురు అమ్మనూవచ్చునని కూడా భవిష్యవాణిలా పలికారు. వాస్తవమేమిటంటే, పాకిస్థాన్ వద్ద అపారమైన చమురు నిక్షేపాలు లేవు. అక్కడ మన సోదరులు లీటర్ పెట్రోల్ రూ.272కు కొనే పరిస్థితి వుంది. పాకిస్థాన్‌తో పోల్చితే భారత్ వద్ద ఎక్కువ చమురు నిక్షేపాలున్నాయి. ఉత్పత్తి చేసే చమురు కూడా పాకిస్థాన్ కంటే ఎక్కువే. అయినా దేశ ఇంధన అవసరాల వల్ల భారత్, రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోకూడదు.
ఈ దిగుమతిని, ఆయుధాల కొనుగోలును ఆపకపోతే భారత్, పరోక్షంగా ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లేననేది ట్రంప్ వాదన. భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలో ట్రంప్ పరోక్షంగా చెపుతున్నారు. ఇది దేశ సార్యభౌమాధికా రానికి గొడ్డలిపెట్టు అని భారత్ భావించదా అంటే, మేం దానిని పెద్దగా పట్టించుకోం అన్నట్టుగా వుంది ట్రంప్ ధోరణి.
అమెరికా వాణిజ్య ఒప్పందం పేరిట చెపుతున్న మాటలకు భారత్ తలవూపడం లేదు, తెస్తున్న ఒత్తిడికి తల వంచడం లేదు. గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులు, పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా భారత్ మార్కెట్లను బార్లా తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనేది ప్రాథమికంగా స్పష్టమైంది. అమెరికా కార్పొరేట్ కంపెనీలతో మన వ్యవసాయ కార్మికులు పోటీ పడాల్సిన అవసరమూ లేదు.
వాణిజ్య ఒప్పందం పేరిట దేశ ప్రయోజనాలను భారత్, అమెరికాకు తాకట్టు పెట్టేందుకు సమ్మతించకపోవడం శుభపరిణామం. ప్రపంచంలో కనీసం ఒక యుద్ధం.. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకైనా డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా ప్రెస్ సెక్రటరీ ఘోషిస్తున్నారు. ఇంతకీ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారా?