27-09-2025 02:09:13 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ యెండ్లూరి వెంకటదాసేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఇన్టెరిమ్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు చేతుల మీదుగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోన్న విజ్ఞాన్స్ విద్యాసంస్థల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
ఇక దినదిన ప్రవర్థమానం చెందుతోన్న దేశ్ముఖి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి డైరెక్టర్గా తాను రెట్టించిన ఉత్సాహంతో సేవలందిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఇటువంటి సువర్ణావకాశం కల్పించిన చైర్మన్ లావు రత్తయ్యకు కృతజ్ఞతలు తెలియజే సుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, పిలాని (బిట్స్ పిలాని) హైదరాబాద్ క్యాంపస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతిగా వైవీ దాసేశ్వర రావు పనిచేశారు.
తొలుత ఎన్‌ఐటీ సూరత్ నుంచి బీటెక్ (మెకానికల్) పూర్తి చేసిన ఆయన ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్టెక్ పూర్తి చేశారు. అనంతరం ఎన్‌ఐటీ రాయ్‌పూర్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. దాసేశ్వరరావుకి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్స్ వీసీ ప్రొఫెసర్ నాగభూషణ్, విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవో మేఘన కూరపాటి, ఇన్టెరిమ్ డైరెక్టర్ ఎం. సుబ్బారావు శుభాకాంక్షలు తెలియజేశారు.