calender_icon.png 22 January, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయోవృద్ధుల కోసం అందుబాటులో డే కేర్ సెంటర్

22-01-2026 12:40:17 AM

ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ 

నిజామాబాద్, జనవరి 21(విజయ క్రాంతి): వయో వృద్దుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణాలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణామ్ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా ఆయా జిల్లాలలో వృద్దుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వృద్దుల కోసం నూతనంగా నెలకొల్పిన డేకేర్ సెంటర్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో వృద్ధుల సంక్షేమం అత్యంత కీలకమని, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆత్మస్థైర్యం పెంపొందించడం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. వార్ధక్య దశకు చేరుకున్న తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలతో వ్యవహరించాలని హితవు పలికారు.

ఈ విషయమై ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో పలు కీలక నిర్ణయాలను తీసుకుందని, తల్లిదండ్రుల ఆలనాపాలనను పట్టించుకోని ఉద్యోగుల జీతాల నుండి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లిస్తామని ఇటీవలే ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని గుర్తు చేశారు. వృద్దులకు ఆరోగ్య సేవలు అందించే వైద్యులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవసరం మేరకు వారికి ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాలని హితవు పలికారు.

కాగా, రెడ్క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రశంసిస్తూ, తన కోటా నిధుల నుండి రూ. 15 లక్షల నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ, అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలుపాలని అన్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్దులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.

ప్రభుత్వ తోడ్పాటుతో రెడ్క్రాస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా వృద్ధులకు నాణ్యతతో కూడిన బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించాల్సిన అవసరం ఉంటుందన్నారు. సీనియర్ సిటిజన్లు తాము వృద్ధాప్యంలోకి చేరుకున్నామనే ఆలోచనను విడనాడి, ఆత్మవిశ్వాసంతో, ఆహ్లాదకరంగా జీవనం గడపాలని ఉద్బోధించారు.

డే కేర్ సెంటర్ పై అంతస్తులో ఉన్నందున వృద్ధుల సౌకర్యార్ధం లిఫ్ట్ ను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. డే కేర్ సెంటర్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, వయో వృద్దులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డి.సి.సి.బి మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్,

కార్యదర్శి గోక అరుణ్ బాబు, బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర రావు, ఎం.సి మెంబెర్స్ సూర్య నారాయణ, శ్రీనివాసులు, వెంకట కృష్ణ, హన్మంత్ రావు, వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు రాజేశ్వర్, సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ప్రతినిధులు భూమన్న, దయానంద్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.