22-01-2026 12:38:39 AM
ఇల్లెందు, జనవరి 21 (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో గడపగడపకు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకురావడానికి మహిళలు ముఖ్య పాత్ర పోషించారన్నారు. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి పథకంలో మహిళలకే ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, డ్వాక్రా సంఘాల సోదరీమణులకు వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు రవాణా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
సకల వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇంకా మూడు విడతలు ఇస్తామని, ఏప్రిల్ లో మరల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు మాటలను నమ్మకండని, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండని కోరారు. ఇల్లందు పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కోట్ల రూపాయలు అభివృద్ధినిధులు తీసుకువచ్చి ప్రతి వార్డులో అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నామని, పనులు కూడా పూర్తి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా బరిలో నిలిపిన గెలిపించే బాధ్యత మీరు తీసుకోండిని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులూ పాల్గొన్నారు.