calender_icon.png 22 January, 2026 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల నియంత్రణ, రహదారుల భద్రతపై పటిష్ట చర్యలు చేపట్టాలి

22-01-2026 12:40:43 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 

భద్రాచలం, జనవరి 21 (విజయక్రాంతి): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు నివారణ, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణకు శాఖల వారిగా చేపట్టవలసిన కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు.

గంజాయి సాగు అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టాలని, రోజువారి తనిఖీ వివరాలను తప్పనిసరిగా నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదకద్రవ్యాలను వినియోగిస్తున్న వారిని గుర్తించి వారికి తగిన కౌన్సిలింగ్ అందించాలని తెలిపారు. 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు పోలీస్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో రహదారుల భద్రతపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసి ప్రాణాలు కాపాడిన గుడ్ సమరిటన్లకు రూ.25,000 ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఆర్ అండ్ బి డి నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పంచాయతీరాజ్  శ్రీనివాస్, ఇంటర్మిడియట్ అధికారి వెంకటేశ్వర్లు, పోలీస్ శాఖ అధికారులు, వైద్య శాఖాధికారులు, సంభంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.