calender_icon.png 27 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల నియామకం

27-09-2025 02:06:17 AM

-వచ్చే నెల 4వ తేదీ నుంచి జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు 

-15న తేదీలోగా జిల్లాకు ఆరుగురు చొప్పున ఆశావహుల జాబితా అందజేత 

-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : అక్టోబర్ నెలాఖరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి సమర్పిస్తా రని తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు.

అనంతరం మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారని, క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని నిర్దేశించారని ఆయన పేర్కొన్నారు. సంస్థాగత పునర్నిర్మాణం పగడ్బందీగా చేయాలని, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలని సూచించారని చెప్పారు.

కేటీఆర్‌కు శిక్ష తప్పదు

ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ తప్పు చేశారని, ముద్దాయిగా నిరూపించబడ్డారని, ఆయనకు శిక్ష తప్పదన్నారు. మూసీ సుందరీకరణను  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. గుజరాత్‌లో సబర్మతినది అభివృద్ధి చేసుకున్నట్టు తెలంగాణలో మూసీని సుందరికరించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృధి విషయంలో రాజకీయాలు ఉండొద్దన్నారు. కిషన్‌రెడ్డి నాకు మంచి మిత్రుడని, ఆయన రాష్టానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటో చర్చకు సిద్ధం..? అని మహేష్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. సీఎంతో పాటు మంత్రి మండలి మొత్తం రాష్ర్ట ప్రయోజనాల కొరకు కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

రేవంత్‌రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఆయనపట్టికి బీసీ రిజర్వేషన్ చేశారని, కేంద్రం దగ్గర పెండింగ్ ఎందుకు ఉందో కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి బండి సంజయ్ ఒక మెట్టుదిగి వస్తే బీసీ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. అంతకు ముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.