27-09-2025 02:05:57 AM
మొదటి రోజు 2 దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో 73 ఏ4 మద్యం దుకాణాలకు శుక్ర వారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ అధికారి నంద గోపాల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ప్రభుత్వ నియమనిబంధనల మేరకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్ల కాలానికిగాను రూ. 3 లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజును ఈ ఏడాది నిర్ణయించారు. ఒక్కరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
నాలుగు స్లాబులుగా కేటాయింపు...
జిల్లాలో నాలుగు స్లాబులుగా మద్యం దుకాణాలున్నాయి. రూ. 50 లక్షల స్లాబులో 15 మద్యం దుకాణాలు, రూ. 55 లక్షల స్లాబులో 17, రూ. 60 లక్షల స్లాబులో 13, రూ. 65 లక్షల స్లాబులో 28 మద్యం దుకాణాలున్నాయి. ఇప్పటికే ఎస్టీలకు ఆరు, ఎస్సీలకు 10, గౌడ కులస్తులకు ఆరు దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన విషయం విధితమే. మిగితా దుకాణాలను ఓపెన్ కేటగిరీ కింద పరిగణించారు.
మొదటి రోజు 2 దరఖాస్తుల స్వీకరణ...
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ కార్యాలయంలో మంచిర్యాల ఎక్సుజ్ పరిధిలో ఇద్దరు (దుకాణం నెంబర్ 1, 6) శుక్ర వారం సాయంత్రం మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ అధికారి నందగోపాల్, సీఐలు దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా డీపీఈఓ నందగోపాల్ మాట్లాడుతూ గడువులోపు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గల సన్ షైన్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ లో గాని హైదరాబాద్ లోని కమిషనర్, ఆబ్కారీ - మధ్య నిషేధ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 23న పీవీఆర్ గార్డెన్స్ లో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, లక్కీ డ్రాలో ఎంపికైన వారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాలు నడిపించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సుజ్ సీఐలు గురువయ్య (మంచిర్యాల), ఇంద్రప్రసాద్ (బెల్లంపల్లి), ఎం హరి (చెన్నూర్), ఎస్ సమ్మయ్య (లక్షెట్టిపేట), కందుల తిరుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.