30-08-2025 05:22:14 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): బాధితులు, ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పోలీస్ అధికారులను సూచించారు. శనివారం పట్టణంలోని పోలీస్ అధికారులు పూలమొక్కలను డీసీపీకి అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిసిపి ఎ.భాస్కర్ మాట్లాడుతూ.... పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్‌ఎస్ విభాగాల పనీతీరును సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించినవి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్, ఆస్తి నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని అన్నారు.