10-01-2026 02:06:17 AM
నవీ ముంబై, జనవరి 9 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాకిచ్చింది. సఫారీ ఆల్‌రౌండర్ డి క్లెర్క్ అద్భుత పోరాటంతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచింది. బంతితో 4 వికెట్లు తీసిన డి క్లెర్క్.. బ్యాట్‌తోనూ అదరగొట్టింది. 44 బంతుల్లోనే 63 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపిం చింది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అమేలియా కెర్ (4), సీవర్ బ్రంట్ (4) నిరాశప రిస్తే జి.కమిలిని (32), హర్మన్ ప్రీత్‌కౌర్ 20 పరుగులు చేశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన ముంబైని ఆదుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 25 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. అటు నికో లా కేరీ కూడా ధాటిగా ఆడి 29 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసింది.
దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌ లర్లలో డి క్లెర్క్ 4 వికెట్లతో ముంబైని దెబ్బతీసింది. ఛేజింగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. మంధాన 18, హ్యారిస్ 25 పరుగులకు ఔటవగా.. తర్వాత ఆర్సీబీ మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి (20), డి క్లెర్క్ జట్టును ఆదుకున్నారు.
కీలక సమయంలో అరుంధతి రెడ్డి ఔటవడంతో ఆర్సీబీ ఓడిపోయేలా కనిపించింది. అయితే డి క్లెర్క్ మాత్రం పోరాటం ఆపలేదు. చివరి ఓవర్లో విజయం కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా..మొదటి రెండు బాల్స్‌లో పరుగులేమీ రాలేదు. తర్వాత వరుసగా 6, 4, 6, 4 బాదడంతో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను అలరించాయి. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండె జ్, సింగ్ యోయో హనీ సింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.