08-05-2025 12:00:00 AM
పెరుగుతున్న అవయవ దానాలు
మహబూబాబాద్, మే 7 (విజయ క్రాంతి): ఒకప్పుడు చనిపోయిన మనిషి పార్థివ దేహాన్ని మట్టిలో కలపడం, అగ్నికి ఆహుతి చేస్తుండేవారు. ఇప్పుడు అకాల మృత్యువాత పడ్డ వారి అవయవాలు ఇంకొకరి జీవితాలను నిలబెడతాయని తెలుసుకొని అవయవదానానికి ముందుకు వస్తున్నారు. అలాగే పార్థివదేహాలను సైతం పూడ్చడం, కాల్చడం చేయకుండా భవిష్యత్ తరాలకు పనికి వచ్చే పరీక్షలకు వినియోగించడానికి వైద్య కళాశాలలకు అందజేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవయవ దానం, పార్థివ దేహాల అప్పగింత పై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో అవయవ దానం చేసే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. అవయవ దానం చేయడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు నిస్వార్ధంగా విస్తృత ప్రచారం చేయడంతో పాటు కొందరు ప్రత్యేకంగా అర్ధాంతరంగా చనిపోయిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి అవయవదానానికి బంధువులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నారు.
అలాగే ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి తమ మరణాంతరం అవయవ దానానికి అంగీకరించే విధంగా కృషిచేసి వారి సమ్మతి పత్రాలను తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశ్రాంత ఉద్యోగులు, యువత, మహిళలు, ఇతర వర్గాలకు చెందిన 74 మంది తమ మరణాంతరం అవయవ దానం చేయడానికి అంగీకార పత్రాలు కాకతీయ మెడికల్ కళాశాలకు సమర్పించి బాడీ డొనేషన్ విల్లింగ్ సర్టిఫికెట్లను అందుకున్నారు.
ఇటీవల వరంగల్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి పిండంలో ప్రాణాంతకమైన వ్యాధిని గుర్తించి ఆ వ్యాధి వల్ల తల్లికి అపాయం కలుగుతుందని, ఆపరేషన్ నిర్వహించి పిండాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ‘సమాజ హితం’ కోసం వైద్య విద్యకు వినియోగించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించి కళాశాలకు అందజేశారు. మృత పిండం భావి వైద్యులకు గైనిక్ విద్య, శాస్త్ర పరిశోధనకు తోడ్పడుతుంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఆదరణ వృద్ధుల ఆశ్రమంలో మురుగన్ అనే వ్యక్తి మరణించగా అతని దేహాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా మెడికల్ కళాశాలకు అందజేశారు. ఇదేవిధంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న సతీమణి అరుణ శ్రీ ఇటీవల మరణించగా ఆమె పార్థివ దేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కళాశాలకు అందజేశారు.
తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాన అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. ఈ విధంగా ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవయవ దానం చేయడానికి అనేకమంది ముందుకు వచ్చారు.
వరంగల్ జిల్లాలో 2,562, హనుమకొండలో 2,105, మహబూబాబాద్ లో 365, ములుగులో ఇంకా 85 భూపాలపల్లిలో 160 జనగామలో 233 మంది తమ మరణానంతరం అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. ప్రమాదాల్లో కొందరు వ్యక్తులు కోల్పోయిన అవయవాలను మార్చగలడం నేటి వైద్య ప్రగతికి నిదర్శనమని, అయితే వారికి తగిన అవయవం లభిస్తేనే ఇది సాధ్యమని వైద్యులు పేర్కొంటున్నారు.
దానం చేయడానికి పనికి వచ్చే అవయవాలు
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవా లు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు.
సహజ మరణం తరువాత ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరా నిలిచిపోవడంతో కీలక అవయవాలు పనికి రాకుండా చనిపోతాయి. కేవలం కంటి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు వంటి కణజాలాలు ఉపయోగిస్తారు. జీవన్మృతుల (బ్రెయిన్ డెడ్) వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ప్రేగులు వంటి కీలక అవయవాలు సేకరించవచ్చు.
‘బాడీ డొనేషన్’ సామాజిక బాధ్యత
మరణానంతరం లేదంటే బ్రెయిన్ డెడ్ వల్ల మృత్యువాతకు గురయ్యేవారు తమ అవయవాలను దానం చేయడం వల్ల మరి కొంతమంది జీవితాన్ని నిలబెట్టేందుకు ‘బాడీ డొనేషన్’ ను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి.
అవయవ దానంపై మరింత అవగాహన పెంపొందించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవయవ దానంపై అవగాహన సదస్సులు, అవయవ దానం వల్ల నిలబడ్డ జీవితాల ఉపో ద్ఘాతాలను వివరించాలి. ఏలాంటి అపోహలకు గురికాకుండా అవయవ దానానికి ముందుకు రావాలి. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాం.
పరకాల రవీందర్ రెడ్డి, అవయవ దాన అసోసియేషన్ కన్వీనర్, మహబూబాబాద్ జిల్లా
తన మరణంతో ఎనిమిది మందికి జీవితానిచ్చిన రమణ
తాను చనిపోయినప్పటికీ తన అవయవ దానం వల్ల ఎనిమిది మందికి జీవితాన్ని ప్రసాదించాడు వద్దన్నపేటకు చెందిన రమణ. రమణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బ్రెయిన్ డేడ్ కు గురయ్యాడు. బ్రెయిన్ డెడ్ కు గురైన రమణ అవయవాలను దానం చేస్తే 8 మంది జీవితాన్ని నిలబెట్టవచ్చని వైద్యులు రమణ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
దీనితో వారు తమ కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. ఆ మేరకు రమణ అవయవాలను వైద్యులు సేకరించారు. అనంతరం రమణ పార్థివదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన రమణ తల్లిదండ్రులు అవయవ దానం పై అపోహలకు గురికాకుండా కొడుకు అవయవాలను దానం చేయడానికి అంగీకరించి 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన సంఘటన పట్ల ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.