30-12-2025 12:00:00 AM
ఆరావళి పర్వతశ్రేణులపై కేంద్రం ఇచ్చిన నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడం శుభ పరిణామం. ఆరావళి విషయంలో తాము ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నామని, కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా రక్షణ కవచంలా ఉపయోగపడుతున్న ఆరావళిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆరావళి రక్షణ విషయంలో ఎలాంటి చర్యలు తీసు కోబోతున్నారనేది సవివరంగా చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే ఆరావళి పర్వత శ్రేణులుగా గుర్తించాలని సుప్రీం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై ప్రతిపక్షాలు సహా పర్యావరణ వేత్తలు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుం టే, దాదాపు 90 శాతం ఆరావళి ప్రాంతానికి రక్షణ అనేది కరువైతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వచనను సుప్రీంకోర్టు సమర్థించడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనికి తోడు ‘సేవ్ ఆరావళి’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలు నిర్వహించిన సోషల్ మీడియా ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆరావళి విషయంలో విమర్శలు పెరగడంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తిరిగి విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
గతంలోనూ మైనింగ్ కార్యకలాపాలు ప్రజా సంక్షేమానికి ఏ విధంగా హాని చేస్తున్నాయో 90 దశకంలోనే సుప్రీంకోర్టు వివరించింది. ఖనిజాల తవ్వకాలను ఆపేయడంతో పాటు వందలాది క్వారీలను మూసివేయాలని ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో తీర్పునిచ్చింది. పర్యావరణ సమతూక స్థితిని కాపాడేందుకు అప్పట్లోనే తవ్వకాలపై నిషేధం విధించింది. మరోవైపు ఆరావళి పరిరక్షణ కోసం సామాన్య ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది.
ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇది పర్యావరణ రక్షణ కోసమే అని కేంద్రం చెబుతున్నా, ముందే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే సమస్య ఇంతదూరం వచ్చేది కాదేమో. మన భూమిపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆరావళి పర్వతశ్రేణి ఆవిర్భవించింది. ఈ పర్వత శ్రేణుల వయస్సు దాదాపు 250 కోట్ల సంవత్సరాలకు పైమాటే. భారత్‌లో ఆరావళి పర్వత శ్రేణులు 670 కిలోమీటర్ల పొడవు, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది.
ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూ పోయే ఆరావళిని దశాబ్దాలుగా మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం దీని పర్యావసనమే. ఇసుక తుపాన్లు రాకుండా, భూగర్భ జలాలు పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నది ఆరావళి పర్వతాలే అన్న విషయం గుర్తుంచుకోవాలి. యూనెస్కో వారసత్వ సంపదగా పేరున్న పురాతన ఆరావళి పర్వత శ్రేణులను రక్షించుకుందాం.