30-12-2025 12:00:00 AM
నేడు ముక్కోటి ఏకాదశి :
భారతీయ సంస్కృతిలో హిందూ పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిలో జాగరణ, ఉపవాసంతో భగవంతున్ని ఆరాధించే పర్వదినం ‘ముక్కోటి ఏకాదశి’ లేదా ‘వైకుంఠ ఏకాదశి’ అత్యంత పవిత్రమైనది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గశిర’ మాసం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ఈ పర్వదినాన వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు. మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమివ్వడాన్ని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు . ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.
మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు ఈరోజునే భగవద్గీతను ఉపదేశించాడని నమ్మకం. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారికి వైకుంఠ ద్వారాలను తెరిచాడనేది ప్రతీతి. వైకుంఠ ద్వారం గుం డా వస్తున్న విష్ణు స్వ రూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవే శం కల్పించాలని వారు కోరుకున్నారు.అందుకే నేడు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం లాంటి వైష్ణవాలయాల్లో భక్తులు ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శిస్తారు.
శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని, రెండవ భాగాన్ని ఇరపట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వస్తారు. పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి.
ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే. ముక్కోటి ఏకాదశినే ‘పుత్రద ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. పూర్వం మహారాజు సుకేతుడు భార్య అయిన చంపక సంతానం కోసం అనేక పుణ్యకార్యాలు, వ్రతాలు చేస్తుండేది.
ఈ నేపథ్యంలో మహర్షులు రాజు దంపతులకు పుత్రసంతానం కోసం ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించాలని చెబుతారు. మహర్షుల సలహాతో ఏకాదశి పర్వదినాన దంపతులిద్దరూ ఉపవాసం చేసిన కొద్ది కాలానికే కుమారుడు జన్మిస్తాడు. అందుకే దీనిని పుత్ర ఏకాదశి అని పిలుస్తారు.
ఆళవందార్ వేణు మాధవ్