30-12-2025 12:00:00 AM
పోలం సైదులు :
తెలంగాణలో గ్రామపంచాయతీల కు సర్పంచ్ నియామకాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 22న అధికారికంగా కొత్త గ్రామపాలకులు కొలువుదీరారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 243-డి ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించగా, దానిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయం నుంచే అన్నివిభాగాల్లో మహిళా రిజర్వేషన్ 50 శాతానికి పెంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల సగం మంది మహిళలు గ్రామ పంచాయతీలకు నాయకత్వం వహిస్తున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలో తాజాగా ముగిసిన గ్రామ పంచా యతీ ఎన్నికల్లో 6వేలకుపైగా మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అందులో జనరల్ స్థానాల్లో 2446, బీసీ మహిళల స్థానాలు 942, ఎస్సీ మహిళల స్థానాలు 908, ఎస్టీ మహిళలు 1434 స్థానాలు ఉ న్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా నుం చి 404 మహిళా సర్పంచ్ స్థానాలున్నా యి.
ఆనాడు భారతీయ మెదటి మహిళా అధ్యాపకురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొదలుకొని, నేటి వాస్తవిక సమాజంలో ఎందరో మహమణుల కృషి ఫలితంగా నేడు వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడమే గాకుండా ‘మాకెవరు సాటి.. మాకు మేమే సాటి’ అనేలా పురుషులతో సమానంగా ప్రతి రంగంలోకి ప్రవేశించి విజయాలు సాధిస్తూ నారీశక్తిని చాటుతూ ఆదర్శముగా నిలుస్తున్న మహిళామూర్తులు చాలా మందే ఉన్నారు. అలాగే సాహిత్యరంగంలో సైతం ఎందరో మహిళలు ఎన్నో రచనలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందులోభాగం గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న దాఖలాలున్నాయి.
సమాన చట్టాలు ఉన్నా..
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్ర ధానిగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పాలకవర్గంలో మహిళమూర్తులు ఆదర్శవంతమైన పాలన సాగించిన తీరు ను చూసే ఉంటాం. అలాంటి సందర్భం లో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా తమకు అవకాశం రాకపోవడంతో సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా పురుషులు తమ కుటుంబంలోనే భార్యలను, తల్లులను, పిల్లలను ఎన్నికల బరిలో నిలబెడుతూ ఆయా స్థానాలను చేజెక్కించు కుంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళ లను కేవలం సంతకాలకే పరిమితం చేసి, వారి స్థానాలలో భార్య చాటు భర్తలా అధికారం చెలామణి అవుతుంది.దీన్నిబట్టి మహిళలకు మగవారిచ్చే గౌరవం కేవలం పాలన దక్కించుకోవడం వరకే అన్న విష యం అర్థమవుతుంది. కార్యాలయాల్లో ఎన్నిక కాబడిన మహిళామణులున్నా కూ డా ఏదైనా అవసరనిమిత్తం వెళితే, ముం దుగా వారి భర్తను లేదా కుమారుడిని కలి సి విషయం చెప్పి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.
బయటి ప్రపంచానికి మగవారికి సమానంగా మహిళలను గౌరవిస్తున్నట్లు గా చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుం ది. రాజ్యాంగం పరంగా తమకంటూ స్థానముండాలని పోరాడి హక్కులు సాధించు కున్న మహిళలు అవకాశాలు పొందుతున్నప్పటికీ, గ్రామ పాలనలో అధికార చెలాయింపు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడమనేది శోచనీయం.
అభివృద్ధికి అడుగులు..
ఇప్పటికైనా మహిళా శక్తిని గుర్తించి వా రికి పూర్తి స్థాయిలో గ్రామ పాలనా పగ్గా లు ఇవ్వడంపై ఆలోచించాలి. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కును కల్పిస్తే మహి ళా సర్పంచులకు గ్రామాలను బాగుపరిచే అవకాశముంటుంది. రాజ్యాంగపరంగా వారికి అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ పురుషుల చేతుల్లో పెట్టడం లాంటి పద్ధతులను వీడనాడాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించి సరైన చర్యలకు ఉపక్రమించాలి.
పాలనకు సంబంధించి మహిళలకు ప్రత్యేక శిక్షణలిస్తూ, స్వతహాగా నిర్ణయం తీసుకునేలా వారిని రూపొందించాల్సిన అవసరముం ది. ఇలా చేయకపోవడం వల్లస్థానిక సంస్థలలో ఆడవారికి ప్రత్యేక రిజర్వేషన్స్ ఉన్నా లేనట్లే అన్న చర్య కిందకు వస్తుంది. కావున ఎన్నికల్లో గెలిచిన మహిళలకు పూర్తిగా స్వే చ్ఛ ఉండేలా, వారి కుటుంబసభ్యుల నియ ంత్రణ లేకుండా, కార్యాలయాల్లోనూ సం స్థాగతంగా ఆడవాళ్లు సొంత నిర్ణయాలు తీసుకొనేలా ప్రభుత్వాలు కృషి చేయాలి.
ప్రస్తుతం అధికశాతం కుటుంబాల్లో మహిళల నిర్ణయాలే శిరోధార్యం, అలాంటి కు టుంబాలే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాయి. అలాంటి మహిళలకు అధికారం విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తే రుజువుచేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
మార్పు అవసరం..
దేశానికి ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలుచేపట్టి, ఒక మహిళా శక్తి ఏంటో నిరూపించలేదా? దేశ ప్రథమ పౌరురాలు (రాష్ర్టపతి)గా విధులు నిర్వర్తించిన ప్రతిభా పాటిల్ కావొచ్చు.. ప్రస్తుతం ద్రౌపదిము ర్ము కావొచ్చు.. వీరు మహిళలైనప్పటికీ తమ పాలనా విధులు నిర్వహిస్తున్నారన్న విషయం గ్రహించాలి. గతంలో సుష్మాస్వరాజ్ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షనేతగా హుందాగా నడుచుకున్న తీరు అందరిని మెప్పించింది. ప్రస్తుతం దేశ ఆర్థిక మంత్రి గా నిర్మలా సీతారామన్ విజయవంతంగా తన సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు.
గత మూడు పర్యాలుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ విజయవంతంగా కొనసాగుతున్నారు. గతంలో సుచేతా కృపాలాని, షీలా దీక్షిత్, మాయావతి, జయలలిత, వసుంధర రాజే, ఉమా భారతి, రబ్రీదేవి, ఆనందిబెన్ పటేల్ ఇలా మహిళామణులెందరో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించడం గొప్ప విషయం. ఇక తెలంగాణ రాష్ర్టంలోనూ ప్రస్తుతం సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా విధులు నిర్వహిస్తున్నారు.
అలాగే వి భిన్న రంగాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ అగ్రస్థానాలకు చేరుకున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలపట్ల మహిళామణులు దృష్టి సారించి, స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ పాలకరంగంలో రాణిస్తున్న మాట అక్షర సత్యం. కానీ గ్రామాల్లోకి వచ్చేసరికి మా త్రం సర్పంచ్‌లుగా ఉన్న మహిళల్లో ఎక్కువశాతం వారి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయం.
పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చుకోరు, క్రమంగా అర్ధమవుతుంటాయి. అలాగే సర్పంచ్‌లుగా మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తే రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజ్యాంగం పరంగా ఎవరి హక్కులను కాలరాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతిఒక్కరిపై ఉన్నది. ఇకనైనా మార్పు రావాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9441930361