01-07-2025 10:49:27 PM
ఏజెన్సీ వాసులకు వైద్య సేవలు అమోఘం...
ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు...
బూర్గంపాడు (విజయక్రాంతి): నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించి సంపూర్ణ ఆరోగ్యం అందరికీ ఉండాలని లక్ష్యంతో వైద్యులు వారి సేవలు అందించడం అభినందదాయకమని, అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారని మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి(Mandal Development Officer Jamala Reddy) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే(National Doctors Day) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జమలారెడ్డి మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలో వైద్యశాల అందించడం ఎంతో కష్టతరమైనప్పటికీ వారు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. డాక్టర్ చదువుకొని వృత్తిలో ఉన్నవారికి చేయూత ట్రస్ట్ సన్మాన కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయం అన్నారు.
బంజరు గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ ప్రధానంగా నిరుపేద కుటుంబంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు వారి ఆరోగ్య దృష్ట్యా ఆర్థిక సహాయం అందించడానికి ముందుగా వైద్య రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత విద్య రంగాన్ని ఎంచుకున్నారని ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేయటం హర్షించదగ్గ విషయం అన్నారు. మండలానికి తాను వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా చేయూత ట్రస్ట్ చేస్తున్న సేవలు అమోఘం అన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ కే. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కీరెడ్డి మల్లారెడ్డి, కోశాధికారి పుట్టి రాజేష్, సహాయ కోశాధికారి గాది నర్సిరెడ్డి, సభ్యులు శనగ మల్లేశ్వరరావు, బిజ్జం వెంకట్రామిరెడ్డి, ఆయుర్వేద డాక్టర్ జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి భవాని, హెచ్ వీలు రమణ, వెంకట నరసమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.