calender_icon.png 17 November, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ నేతను నిర్బంధించిన ఫాంహౌస్ కూల్చివేత

23-07-2024 12:05:00 AM

  • అనుమతులు లేవని గుర్తించిన పోలీసులు 
  • భారీ బందోబస్తు మధ్య నేలమట్టం

రాజేంద్రనగర్, జూలై 22: నార్సింగిలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసి శంషాబాద్ పరిధిలోని ధర్మగిరి ప్రాంతంలో నిర్బంధించిన ఫాంహౌస్‌ను పోలీసులు సోమవారం కూల్చి వేయించారు. దానికి అనుమతులు లేవని గుర్తించి శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జేసీబీ సాయంతో భారీ బందోబస్తు నడుమ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఫాంహౌస్‌ను నేలమట్టం చేయించారు. ఫాంహౌస్ యజమానికి నోటీసులు జారీ చేసిన అనంతరం మున్సిపల్ అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు.

అయితే, ఫామ్‌హౌస్ స్థలాన్ని తమ నుంచి కబ్జా చేశారని ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన ఓ మార్వాడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నరేందర్‌ను రక్షించే క్ర మంలో సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్ వద్దకు చేరుకున్నారనే సమాచారంతో సదరు వ్యక్తి అక్కడికి వచ్చి పోలీసులకు విషయాన్ని తెలిపారు. అయితే, సదరు ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మున్సిపల్ అధి కారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. 

సెటిల్‌మెంట్లకు అడ్డా.. 

ధర్మగిరి ప్రాంతంలో రౌడీ గ్యాంగ్ నిర్మించుకున్న ఫాంహౌస్ అసాంఘిక కార్యకలా పాలకు అడ్డాగా మారిందని పోలీసుల తనిఖీల్లో తేలింది. అక్కడ రౌడీ మూకలు మారణాయుధాలు కూడా ఉంచారు. ఎవరైనా వస్తే దాడి చేసేందుకు కూడా వేట కుక్కలను పెంచారు. వాటి కోసం ప్రత్యేకంగా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రౌడీ గ్యాంగ్ అనేక సెటిల్‌మెంట్లు చేసింది. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు.. ఎస్‌వోటీ పోలీసులతో కలిసి అక్బర్ హిల్స్‌లో కబ్జాకు గురైన కోట్లు విలువ చేసే స్థలంలో దాడులు నిర్వహించి నాలుగు కత్తులు, ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌కు కూడా నరేందర్ కిడ్నాప్‌తో సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.