11-08-2025 01:34:21 AM
- ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్
- బీహార్‌లో మరో రగడ షురూ
- త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు
పాట్నా, ఆగస్టు 10: బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటర్ కార్డులున్నాయని ఆరోపించారు. ఒక ఓటరు ఐడీ బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో, మరో ఓటరు ఐడీ లఖీసరాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందని తెలిపారు. ఆయన వయస్సు ఒక కార్డులో 60 సంవత్సరాలుగా ఉండగా.. మరో కార్డులో 57 సంవత్సరాలు ఉందని.. ఇది ఎన్నికల కమిషన్ నియమాల ఉల్లంఘనే అని తేజస్వీ పేర్కొన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (సర్) వల్లే ఇటువంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఆరోపణలు తోసిపుచ్చిన డిప్యూటీ సీఎం
తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలను ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఖండించారు. ‘నా పేరు గతంలో బాంకీపూర్ నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో ఉండేది. లఖీసరాయ్‌కి మారిన అనంతరం నిబంధనల ప్రకారం బాంకీపూర్ జాబితా నుంచి పేరు తొలగించాలని దరఖాస్తు సమర్పించా. ఎటువంటి తప్పు చేయలేదు. ప్రక్రియలో ఆలస్యం వల్లే ఇలా జరిగి ఉం టుంది. తేజస్వీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ తేజస్వీ ‘జంగల్ రాజ్ యువరాజు’ అని తీవ్ర విమర్శలు చేశారు.