calender_icon.png 2 December, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 2026 నాటికి అభివృద్ధి పనులు పూర్తి

02-12-2025 12:24:36 AM

  1. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

ఖమ్మం, డిసెంబర్ 1 (విజయక్రాంతి): మార్చి 2026 నాటికి ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఖమ్మం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ఏడాది మున్నేరు వరదల వల్ల వేలాది ప్రజలు ఇబ్బంది పడ్డారని, ప్రతి సంవత్సరం వరదల కారణంగా ఖమ్మం నగరంలో 10 డివిజన్ల ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్య, భూ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసి, నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ నిర్దిష్ట గడువు మార్చి 2026 లోగా పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు.

ఎస్టీపి నిర్మాణం, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు వెడల్పు పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, 10 రోజులలో భూములు సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో 3 కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయని, హైదరాబాద్ లోని దుర్గం చెరువు, కరీంనగర్ లోని మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి లను తన హయాం లోనే మంజూరు చేశానని, నేడు ఖమ్మంలో మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన రెండు బ్రిడ్జిల కంటే మున్నేరు కేబుల్ బ్రిడ్జి పెద్దదని అన్నారు.

కేబుల్ బ్రిడ్జి వద్ద పర్యాటకంగా కూడా అభివృద్ధి జరిగేలా టూరిజం ప్యాకేజీ ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే బెస్ట్ గా ఉండే విధంగా కేబుల్ బ్రిడ్జి వద్ద లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాలపేట, బల్లేపల్లి, ఖానాపురం చెరువుల నుంచి వర్షాకాలం వరద నీరు అధికంగా వస్తుందని, దీని నియంత్రణకు 200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టామని అన్నారు. 10 రోజులలో ఎస్టిపి నిర్మాణ పాయింట్ ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు.

మార్చి 2026 నాటికి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఖమ్మం నగరం మణిహారంగా ఉండేలా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని అన్నారు.డిసెంబర్ 2న కొత్తగూడెం జిల్లాలో జరుగనున్న సీఎం టూర్ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఉంటుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా ఖనిజాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం లేదని, ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదన ఆమోదించిన సీఎం కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఎర్త్ సైన్స్ విశ్వ విద్యాలయానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం జరిగిందని, దీనినీ సీఎం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని అన్నారు. 

ఈ మీడియా సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.