27-08-2025 02:46:56 AM
రేవంత్‌రెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తే సహించేది లేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డిని కోస్తే డబ్బులు వస్తాయంటున్న బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్.. పదేళ్లుగా ప్రజల సొమ్మును దిగమింగిన కేసీఆర్, సంతోష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కోస్తే అక్రమ సంపాదన బయటికి వస్తుందని తెలిపారు.
కేసీఆర్ బినామీ అయిన సంతోష్‌ను కింది నుంచి పైవరకు కోస్తే డబ్బులు వస్తాయనే విషయం క్రిశాంక్ తెలుసుకోవాలన్నారు. గాంధీభవన్‌లో పల్లీలు అమ్ముకునే వారికి కూడా క్రిషాంక్ పరిపోడని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి భజన చేసుకో కాని, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కాంగ్రెస్‌పై విమర్శ లు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ను ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.