05-12-2025 12:00:00 AM
దేవరకొండ, డిసెంబర్ 4: ఈ నెల 6న నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన జరగనుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.
హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు,సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలు కూర్చునేం దుకు సరిపడా కుర్చీలు,వచ్చిన వారికి త్రాగునీరు లాంటి కనీస ఏర్పాట్లు అన్ని పకడ్బం దీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ 12 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం దేవరకొండ అని పేర్కొన్నారు.
ఈ నెల 6న ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తం డాలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధలో కొంచెం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యేదని అన్నారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణ పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా గ్రావిటీ ద్వారా నల్లగొండకు నీటికి తీసుకువస్తామని చెప్పారు.
నక్కల గండి, దిండి ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా నీటిని నింపుతామని, భూగర్భ జలాలు పెంచుతామని స్పష్టం చేశారు. కాగా పేద వారికి బాసటగా నిలిచే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తమ పాలన సాగుతుందని, కొడంగల్ లాగానే వెనుకబడిన దేవరకొండను దత్తత తీసుకోవాలని, ఎమ్మెల్యే బాలు నాయక్, తాను ముఖ్యమంత్రిని కోరతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.