02-01-2026 01:19:54 AM
కరింనగర్/వేములవాడ, జనవరి1(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాకొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించా రు.ఆయా పార్టీలు, సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. ఆయా ప్రాంతాల్లో న్యూ ఇయర్ కేక్లు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పలువురు అధికారులను, ప్రజాప్రతినిధులను పలు సంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శు భాకాంక్షలు తెలిపారు.
రాజన్న సన్నిధిలో భీమన్న సేవలో ప్రముఖుల పూజలు నిర్వహించారు.దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామిని నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ప్రముఖులు దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్ర మబత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ శాసనసభ్యులు ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చక బృందం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.గర్భగుడిలో కొలువుదిరిన శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రముఖులకు రాజన్న ఆలయ అర్చక బృందం ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు ప్రముఖులకు స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.నూతన సంవత్సరం సందర్భంగా కొండగట్టు, ధర్మపరి తో పాటు నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆశలతో, విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. మార్కెట్ రోడ్డు లో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చి, సీఎస్‌ఐ వెస్లీ చర్చి, లూర్దు మాత చర్చి, సెయింట్ మార్క్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.