28-05-2025 01:24:04 AM
జానపద సంస్కృతితో పులకించిన ఆలయం
హుస్నాబాద్, మే 25: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరుగుతున్న ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ మహాజాతర, ఈ మంగళవారం అడుగడుగునా సంప్రదాయ వైభవాన్ని చాటింది. వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి, బుద్ధపూర్ణిమ నాడు ప్రారంభమైన ఈ నెల రోజుల జాతరకు జనం తరలి వస్తున్నారు.
ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతుండగా, ఈ మంగళవారం కూడా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. తెలంగాణలో మరెక్కడా కనిపించని ఈ విశిష్ట దళిత బహుజన జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
బోనాలు, విందు భోజనాలతో కోలాహలం
మంగళవారం తెల్లవారుజాము నుంచే ఎల్లమ్మ ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లలో వచ్చిన భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కోళ్లు, మేకలను బలిచ్చి, కల్లు సాక, బెల్లం పానకంతో అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద కుటుంబ సమేతంగా కలిసి భోజనాలు చేశారు. జాతరలో జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎల్లమ్మ పట్నాలు వేసి, బైండ్లవారు జమిడిక వాయిద్యాలతో అమ్మవారి చరిత్రను కథల రూపంలో వివరించారు.