calender_icon.png 10 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ జాతరకు పోటెత్తిన భక్తజనం

10-11-2025 01:38:17 AM

ఇబ్రహీంపట్నం, నవంబర్ 9: దక్షిణకాశి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.  మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసినా కనుచూపు మేరలో భక్తులతో నిండిపోయాయి.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా గుండంలో స్నానమాచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారి సన్నిధానంలో సత్యనారాయణస్వామి వ్రతాలతో పాటు తులసికోట, శివలింగం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తులు సమీపంలో ఉన్న కబీర్ దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహ బాబా సమాదితో పాటు కబీర్‌దాస్ మందిరంలో పూజలు నిర్వహించారు. మంచాల సీఐ మధు, ఎస్సులు నాగేశ్వరరావు, వంశీ  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. పోలీసులతో పాటు సీసీ కెమెరాల నడుమ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.