23-08-2025 08:39:59 PM
కొండాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగిస్తాం...!
నిర్మాణంలో ఉన్న ఎల్లారెడ్డి అర్బన్ పార్క్ పనులను పరిశీలించిన డీఎఫ్ఓ నిఖిత..!
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): పోడు భూముల పట్టాలు పొందిన వారు పక్కన ఉన్న అటవీ భూములను కబ్జా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి పట్టాలను రద్దు చేస్తామని డీఎఫ్ఓ నిఖిత(DFO Nikitha) అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సోమర్ పేట గ్రామ బైపాస్ వద్ద వున్న అటవీ శివారులో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతతో పాటు పనులు వేగవంతంగా నిర్మించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్ పార్కు ఆవరణలో తిరిగి పార్క్ పనులను పరిశీలించారు.
అనంతరం ఎల్లారెడ్డి రేంజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, అటవీ భూములు అన్యక్రాంతం చేసిన, వారిపై అటవీ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని కలప స్మగ్లర్లపై కూడా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని అదేవిధంగా అటవి భూముల రక్షణ కొరకు చుట్టూ కందకాలు తవ్వించడం జరిగిందని, ఈ సంవత్సరం రెండు లక్షల చెట్లు నాటడం లక్ష్యం ఉండగా ఇప్పటివరకు 42 వేల మొక్కలు నాటించామని మిగతా మొక్కలను త్వరలో నాటి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. కొండాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన షెడ్ లను తొలగించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ సంరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ రామకృష్ణ, ఎఫ్ ఆర్ ఓ చైతన్య కుమార్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.