30-11-2024 10:42:10 PM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ సాధన సర్వేలో జిల్లాను మంచి స్థానంలో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఈ నెల 4న నిర్వహించనున్న జాతీయ సాధన సర్వే పరీక్షల నిర్వహణపై అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ సాధన సర్వేలో జిల్లాను ముందుండేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
జిల్లాలో ఎంపికైన 81 పాఠశాలలో 3, 6, 9 తరగతుల విద్యార్ధులకు సాధన పరీక్షలు ఉన్నందున విద్యార్దులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు ఓ.ఎం.ఆర్. పద్ధతిలో జరుగుతాయని, ఇది వరకే పాఠశాలలకు అభ్యాసన పుస్తకాలు అందించడం జరిగిందని, విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇలాంటి ఆందోళన చెందకుండా విద్యార్థులు 100 శాతం పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ పరీక్షలకు పరిశీలకులు వస్తున్నందున పాఠశాలలలో పండుగ వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ నాణ్యత కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.