calender_icon.png 21 July, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దౌత్య సంక్షోభం!

21-06-2025 12:00:00 AM

కెనడాలోని కననాస్కిస్‌లో గ్రూప్-7 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ వారం మొదట్లో జరిగిన సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈసారి జీ-7 సదస్సు సాధించిన ప్రయోజనాలు ఏమిటంటే, శూన్యమనే చెప్పాలి. ఆర్థికంగా బలమైన ఈ దేశాల కూటమి ప్రస్తుతం పలు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధాలు సమసి పోయేందుకు తన పలుకుబడిని ఉపయోగించాల్సింది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య అంతకంతకూ పెరిగిన యుద్ధం, పశ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడితో మొదలైన యుద్ధం పర్యవసానాలపై జీ-7 దేశాల నేతలు ఒక మార్గాన్ని చూపే విధంగా వ్యవహారం సాగలేదు. తనకేదో అర్జెంట్ పని వున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీ-7 సదస్సు నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. ప్రపంచంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు యత్నాల మాట అటుంచితే, ప్రపంచ వాణిజ్యాన్ని  అతలాకుతలం చేస్తున్న ట్రంప్ టారిఫ్‌లపైనా చర్చ జరగలేదు.

జీ-7 గ్రూప్‌లోకి రష్యా, చైనాలను కూడా చేర్చి దానిని జీ-9గా విస్తరిద్దామని ట్రంప్ మరోసారి ప్రతిపాదన తెచ్చారు. దీనివల్ల రష్యా, చైనాలపై కూడా ఆధిపత్యం సాధిద్దామనే ఆలోచన తప్ప మరోటి లేదు. జీ-7 దేశాలు ఇజ్రాయెల్ దుస్సాహసాన్ని ఖండించకుండా, ఇరాన్‌పై అది దాడులకు దిగి యుద్ధాన్ని తేవడం సబబేనని ముసాయిదా తీర్మానం తేవడం మరో వైచిత్రి. ఉగ్రవాదంపై, ఇతర సమస్యలపై జీ-7 శిఖరాగ్ర సదస్సు సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తుందని భారత్ సహా పలు దేశాలు ఆశించాయి.

అదీ జరగలేదు. జీ-7 గ్రూప్‌లో భారత్ సభ్యత్వ దేశం కాదు. కాని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌ను గుర్తించి ప్రతిసారి జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తున్నారు. అలీన దేశంగా బలమైన మూలాలున్న భారత్, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను కట్టడి చేయాలన్న అంశాన్ని జీ-7 వేదికపై బలంగా చెప్పింది.

పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రసంస్థలు జరిపిన దాడి తర్వాతి పరిణామాలను పశ్చిమ దేశాల ముందుకు తీసుకు రావడంలో ఈ వేదిక భారత్‌కు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లయింది. ఉగ్రవాదంపై కానీ, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంపై కానీ జీ-7 దేశాలు నిర్దుష్టంగా తమ వైఖరిని చెప్పలేక పోయాయి. అసలు దౌత్యమనేది ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఉక్రెయిన్ నాయకుడు జెలినిస్కీ ఈ వేదికపై చెప్పిన మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. ఎవరి ప్రయోజనాలను వారు చూసుకుంటూ దౌత్యానికి  సంకల్పం తీసుకోవడం జరుగని పని.

కొద్ది నెలల క్రితమే కెనడా ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నెతో ప్రధాని మోదీ చర్చలు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సుహృద్భావ పరిస్థితులను పునరుద్ధరించుకొనేందుకు దోహదపడ్డాయి. కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు హరిదీప్ సింగ్ నిజ్జార్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు కుంటుపడ్డాయి. నిజ్జార్ హత్యతో తమకు ప్రమేయం లేదని భారత్ పలుమార్లు స్పష్టంచేసింది.

అయినా కెనడా గత ప్రధాని జేమ్స్ ట్రూడో భారత్ వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా తెగిపోయాయి. భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో వలస వెళ్లిన సిక్కులు, పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్లే భారత విద్యార్థులకు ఈ పరిణామాలు కష్టాలు తెచ్చాయి. జీ సదస్సు సందర్భంగా కెనడా, భారత్ ప్రధానులు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ సమస్యలను పరిష్కరించుకొని దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడం దిశగా ముందడుగు పడింది.