21-08-2025 01:36:14 AM
వరంగల్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): వరంగల్ లోని ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. యూనియన్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఫిరోజ్, అజ్మత్ లతో పాటు సర్వర్ పాషా, లక్ష్మణ్, పీటర్, యూసుఫ్ అనే వ్యక్తులు వర్తమాన కార్యవర్గం మరియు సాధారణ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓరుగల్లు లారీ యూనియన్ అసోసియేషన్ ఆరోపించింది.
గొర్రెకుంట శివారులో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు ఎండి షకిల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్, ఇజిగిరి శంకర్ మరియు పలువురు సభ్యులు మాట్లాడుతూ, గతంలో ఫిరోజ్, అజ్మత్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సుమారు రూ. 32 లక్షల కార్మికుల చిట్టి డబ్బులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ డబ్బుల గురించి లెక్క అడిగినందుకు, వారు రాజకీ య అండదండలతో తమను బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వాపోయారు.
రాజకీయ జోక్యం, పోలీసుల వైఖరిపై ఆందోళన
స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుకొని ఫిరోజ్, అజ్మత్ కార్మికులను మానసికంగా వేధిస్తున్నారని యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇరువర్గాలతో మాట్లాడి, దుర్వినియోగం చేసిన డబ్బులకు లెక్క అప్పజెప్పాలని సూచించినా, వారు పట్టించుకోవడం లేదని తెలిపారు.
అంతేకాకుండా, పోలీసులు సైతం ఫిరోజ్, అజ్మత్ లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫిర్యాదులను స్వీకరించడం లేదని ఆరోపించారు. లారీ కార్మికుల సమస్యకు రాజకీయ రంగు పులిమి, వారిని తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
150 మంది లారీ యజమానులకు తీవ్ర ఇబ్బందులు
గొర్రెకుంటలోని లారీ పార్కింగ్ స్థలాన్ని ప్రస్తుత కమిటీ లీజుకు తీసుకున్నప్పటికీ, ఫిరోజ్, అజ్మత్ లు అడ్డుకుంటున్నారని యూనియన్ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా, యూరియా లారీలను లోడింగ్ చేయనివ్వకుండా గోధుమల వద్ద అడ్డుకుంటున్నారని, దీని వల్ల దాదాపు 150 మంది లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భయభ్రాంతులకు గురవుతున్నారని వివరించారు.
లారీ కార్మికుల స్థలంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కార్మికులను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జోక్యం కోరిన కార్మికులు ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకొని, 150 మంది లారీ కార్మికులకు అండగా నిలవాలని యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఫిరోజ్, అజ్మత్ ల ఆగడాలను అరికట్టి, కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో లారీ అసోసియేషన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.