31-01-2026 12:52:34 AM
నేడు జీహెచ్‌ఎంసీ వార్షిక ప్రణాళిక ముసాయిదాపై చర్చ
మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన స్పెషల్ కౌన్సిల్ భేటీ
గత ఏడాది కంటే రూ.745 కోట్లు అదనం!
గళం విప్పేందుకు సిద్ధమైన విపక్షాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 30 (విజయక్రాంతి): రానున్న ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలను మార్చే దిశగా జీహెచ్‌ఎంసీ భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. మొత్తం రూ.11,460 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ వార్షిక బడ్జెట్ ముసాయిదా శనివారం ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో చర్చకు రానుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌పై సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం పాలక మండలి ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే ఏడాదికి సంబంధించిన ఆదాయ మార్గాలు, వ్యయం, పెట్టుబడులపై అధికారులు ఇప్పటికే కార్పొరేటర్లకు సమగ్ర సమాచారాన్ని అందించారు.
ఆర్థిక సంవత్సరం 2025 బడ్జెట్ రూ. 10,714.73 కోట్లతో పోల్చితే, రానున్న ఏడాదానికి రూ.745.27 కోట్లను పెంచి అధికారులు ఈ మెగా ప్లాన్‌ను రూపొందించారు. ఆస్తి పన్ను, నిర్మాణ అనుమ తులు, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీల ద్వారా రూ.6,441 కోట్ల రెవెన్యూ ఆదాయాన్ని, రూ.4,057 కోట్లుగా రెవెన్యూ వ్యయాన్ని నిర్ధారించారు. ఈ బడ్జెట్‌లో ఇటీవలే జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలకు అధికారులు పెద్దపీట వేశారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలను దష్టిలో ఉంచుకుని, విలీనమైన సమయంలో ఈ సంస్థల నుంచి వచ్చిన రూ.1,860 కోట్లకు అదనంగా, జీహెచ్‌ఎంసీ ఈసారి రూ.2,260 కోట్లను కేటాయించింది. బడ్జెట్ అజెండాగా జరుగుతున్న ఈ ప్రత్యేక సమావే శంలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు సిద్ధమయ్యాయి.