31-01-2026 12:50:52 AM
ఆ- పీహెచ్‌సీకి వెళ్లేందుకు జంకుతున్న రోగులు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
సిద్దిపేట జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన
సిద్దిపేట, జనవరి 30(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఒకరు వైద్య వృత్తి పవిత్రతను మంటగలుపుతున్నాడు. పీహెచ్‌సీకి వచ్చే మహిళలు, బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.అలాగే విద్యాసంస్థల తనిఖీల పేరుతో బాలికల పాఠశాలలకు వెళ్లి తరగతుల్లోకి, హాస్టల్ డార్మెటరీల్లోకి ప్రవేశించి విద్యార్థినులతో చనువుగా మాట్లాడటం, పదేపదే తాకడం చేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఒక కళాశాల లో వైద్యుని తీరుపై ఆగ్రహించిన సిబ్బంది, ఉపాధ్యాయులు అతన్ని గదిలో నిర్బంధించారని సమాచారం. అయితే తనకు ఉన్న పరిచయాలు అడ్డుపెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడన్న ఆరోపణలు మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నిర్వాహకులు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా, ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో పీహెచ్సీలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిపై ప్రేమముసుగులో వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, బ్లాక్ లిస్టులో పెట్టారని ప్రశ్నలు, పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపు ఒత్తిళ్లు చేయడంతో ఆగకుండా గురువారం ఆ మహిళ విధులు నిర్వహిస్తున్న సమయంలో పీహెచ్‌సీకి వెళ్లి అక్కడ మాటలతో హద్దులు దాటాడు.
దీంతో అక్కడే ఆయనకు దేహశుద్ధి చేసినట్టుగా విశ్వాసనీయ సమాచారం. ఇంత జరిగినా శాఖ పరంగా విషయం బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ విషయంపై ‘విజయక్రాంతి’ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ ను వివరణ కోరగా నారాయణరావుపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాపురెడ్డి పై ఫిర్యాదులు వచ్చాయని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. మిగతా విషయాలు తన దృష్టికి రాలేదని వివరించారు. విచారణ జరిపి రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.