31-01-2026 12:54:01 AM
మొయినాబాద్, జనవరి 30(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి నామినేషన్లు దాఖలు చేయడానికి తరలివచ్చారు. మున్సిపల్ పరిధిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపించింది. అభ్యర్థులు ర్యాలీల రూపంలో నామినేషన్ కేంద్రాలకు చేరుకోవడంతో వాతావరణం ఉత్సాహంగా మారింది.
నామినేషన్ దాఖలుకు వచ్చిన అభ్యర్థులతో పాటు కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ పార్టీ బలాన్ని ప్రదర్శించారు. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల చివరి రోజున ఏర్పడిన ఈ రద్దీతో మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.