21-12-2025 12:31:06 AM
8వ వేతన సంఘం సిఫార్సులపై విస్తృతమైన చర్చ
పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు
అన్ని కుదిరితే ౨౦౨౭ మధ్యలోనే సిఫార్సులు.. లేదంటే ఆ తర్వాత..
సిఫార్సులపై సోషల్ మీడియాలో వదంతులు, తప్పుడు ప్రచారం
అనేక అంశాలపై కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఎనిమిదో వేతన సంఘం సిఫారసుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సుల పెంపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించిన కసరత్తును వేగవంతం చేసింది. ప్రతి 10 సంవత్సరాలకోసారి కొత్త వేతన కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ౭వ వేతన సంఘం గడువు ఈ నెల 31తో ముగియనుంది.
ఆ మరుసటి రోజు.. అంటే జనవరి ౧వ తేదీ నుంచే ౮వ వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే.. ఈసా రి మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈసారి ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలైంది. ౮వ వేతన సంఘం ఏర్పాటుకు నవంబర్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విధి విధానాలు, సిఫార్సుల కోసం వేతన కమిషన్‌కు 18 నెలల సమయం ఇచ్చింది. అంటే.. ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చేందుకే 18 నెలలు పడుతుందన్నమాట.
అన్ని సక్రమంగా సాగితే.. అంతకమునుపే కమిష న్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసే అవకాశం ఉంది. లేదంటే.. 2027 మధ్యన కమిషన్ కేంద్రప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించే అవకాశం ఉంది. సిఫార్సుల ద్వారా విధులు నిర్వర్తిస్తున్న 49 లక్షల మంది కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అయితే.. ఆలస్యమైన కాలానికి సంబంధించి ఏరియర్స్ (బకాయిలు)ను కూడా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి చెల్లించనుంది.
ఎంత పెరగవచ్చంటే..
వేతనాలు, పెన్షన్ల పెంపు విషయానికి వస్తే, ఈసారి 20 శాతం నుంచి 35 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 7వ వేతన సంఘం ఫిట్ మెంట్ 2.57గా నిర్ణయించింది. 8వ వేతన కమిషన్ దాని 2.4 నుంచి 3.0 వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల కనిష్ఠ (బేసిక్) ప్రాథమిక వేతనం గణనీయంగా పెరుగుతుంది. కమిషన్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, పన్ను వసూళ్లు, ప్రభుత్వ ఆదా యాన్ని బట్టి వేతన సవరణ ఉంటుంది. కేవలం జీతాలే కాకుండా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ), డీఏ వంటి ఇత ర అలవెన్సులపైనా సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వా తే వేతనం ఎంత శాతం పెరుగుతుందనే అంశవంపై పూర్తి స్పష్టత వస్తుంది. కోట్లాది మంది వేచి చూస్తున్న ఈ ప్రక్రి య సజావుగా సాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల చేతికి కొత్త జీతాలు అందుతాయి.
6వ వేతన కమిషన్ సమయంలో..
6వ వేతన సంఘం సగటున 40శాతం వేతనాలు పెంచాలని సిఫార్సు చేసింది. అలాగే 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో 23- 25% పెంపునకు సిఫా ర్సు చేసింది. ఇప్పుడు 8వ వేతన సంఘం 20 35శా తం వరకు సిఫార్సు చేస్తుందని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుంచి 3.0 మధ్య ఉండవచ్చని ఓ అంచనా. దీంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు బేసిక్ వేతనాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులకు కూడా మంచి పెంపు ఉంటుందనే అంచనాలున్నాయి.
తప్పుడు ప్రచారం.. వదంతులు
కొందరు కేటుగాళ్లు 8వ వేతన సిఫార్సులపై తప్పుడు ప్రచారానికి తెర లేపారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపు సహా ఇతర ప్రయోజనాలు అందవని ప్రచారం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపు, వేతన సంఘం ప్రయోజనాలు అందవని, కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాదని.. ఫైనాన్స్ యాక్ట్ 2025లో ఈ విషయం స్పష్టంగా పేర్కొందంటూ సదరు ఫేక్ న్యూస్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి పే కమిషన్ ప్రయోజనాలు సహా డీఏ పెంపు వర్తించదని ప్రచారం చేస్తున్నారు.
అసలు నిజం ఏంటంటే..
తప్పుడు ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అసలు నిజం ఏంటో వెల్లడించింది. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలలో మార్పు లేదని స్పష్టం చేసింది. సీసీఎస్ (పెన్షన్) నిబంధనలు 2021లోని రూల్ 37 ప్రకారం.. ప్రభుత్వం చర్యలు తీసుకోబడిన ఉద్యోగి మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోతారని స్పష్టం చేసింది. ఆ నిబంధనల ప్రకారం.. ‘ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన దుష్ర్పవర్తన, తప్పుల కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే. వారికి ప్రభుత్వం అందించే పదవీ విరమణతో సహా అనేక రకాల ప్రయోజనాలు కోల్పోతారు.
డీఏ హైక్స్, పే కమిషన్, పదవీ విరమణకు సంబంధించి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కారు.’ ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన 3 శాతం డీఏతో ఇప్పటివరకు ఉన్న 53 శాతం డీఏని కలిపితే.. అది 58 శాతానికి చేరుతుంది. 8వ వేతన సంఘం సిఫారసు చేసే బేసిక్ శాలరీలో విలీనం చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. మూలవేతనంలో డీఏ విలీనానికి సంబంధించి ప్రతిపాదన లేదని కేం ద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇదే అంశ ంపై లోక్‌సభలో ప్రశ్నలు ఉత్పన్నమవగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ‘ప్రస్తుత డీఏను మూల వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదు’ అని స్పష్టం చేశారు.