calender_icon.png 26 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల అందజేత

26-07-2025 12:00:00 AM

నారాయణపేట.జులై 25( విజయ క్రాంతి )ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని రైతులకు సాగు నీరందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జీ కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన 36 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులను స్థానిక ఆర్డీఓ రామచంద్రనాయక్ కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో నష్టపరిహారం అందించలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారాన్ని ఇంకా కొంత పెంచి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్న విస్తానని, సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం పెంచేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు.

నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పథకం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని ముఖ్యంగా భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.ఆర్డీఓ రామచంద్రనాయక్ మాట్లాడుతూ... నారాయణ పేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు, ఇతర ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.

భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా శుక్రవారం భూములు కోల్పోయిన దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామానికి చెందిన 21 మంది రైతులకు 59.99 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను, అలాగే నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన 15 మంది రైతులకు రూ.52.15 లక్షల చెక్కులను శివకుమార్ రెడ్డి, ఆర్డీఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ కార్యాలయ ఏ.వో. అనిల్ కుమార్, తహాసిల్దార్లు తిరుపతయ్య, వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్, డీటీ బాల్ రాజ్ తదితరులుపాల్గొన్నారు.