calender_icon.png 27 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ

27-09-2025 12:00:00 AM

లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేసి, 92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. పండుగ వాతావరణం నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపించి, లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు.

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆదర్శ గ్రామం అంకాపూర్ నుండి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తోందని, రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు, మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు.

అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. జిల్లా రైతులు కూడా సాంప్రదాయంగా వస్తున్న వరి సాగుకే పరిమితం కాకుండా, పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, నూతన వంగడాల దిశగా దృష్టిని కేంద్రీకరిస్తూ అంకాపూర్‌కు మరింత వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కోసం ప్రత్యేక చొరవ చూపడం జరిగిందన్నారు. అర్హులైన మిగతా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తున్నానన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు అక్కడక్కడా వివిధ దశల్లో నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.

ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, డీఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.