calender_icon.png 11 May, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా తూకం వేసిన ధాన్యం తరలింపు

10-05-2025 10:03:04 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించి తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు, గోదాములకు తరలించే కార్యక్రమం శనివారం మరింత వేగవంతంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నాలుగు క్లస్టర్ల పరిధిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా నియమించిన అధికారుల పర్యవేక్షణ లో తరలింపు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిస్తే నష్టం అధికంగా సంభవించే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు, త్వరితగతిన రవాణాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగడంతో శుక్రవారం నుండి ధాన్యం రవాణా ముమ్మరంగా నడుస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను గుర్తించిన అధికారులు కాంటావేసిన ధాన్యాన్ని అక్కడికి తరలిస్తున్నారు. అలాగే సీఎంఆర్ కోసం కేటాయించిన 34 రైస్ మిల్లులకు దాన్యం రవాణా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి కొర్రీలు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించడానికి చేపట్టారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు, రవాణా పరిస్థితిని పరిశీలించడానికి తహసీల్దారులకు బాధ్యతలు అప్పగించడంతో ఆయా కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను నేరుగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు చేరవేస్తున్నారు. దీనితో జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి మానిటరింగ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు రవాణా వేగవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారు.