10-05-2025 09:51:22 PM
వరంగల్ ఆర్ఎం విజయ భాను
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని వరంగల్ ఆర్ఎం విజయభాను అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో వరంగల్ రీజియన్ ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఆయా డిపోలకు చెందిన ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. తొర్రూరు డిఎం పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎం విజయభాను మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని తెలిపారు.
రవాణా వ్యవస్థలో అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీ నిత్యం వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుందని తెలిపారు. డ్రైవర్ గా విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వ్యసనాల జోలికి వెళ్ళవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంపుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు.
రాష్ట్రంలోనే ఉత్తమ రీజియన్ గా వరంగల్ ను నిలిపేందుకు సిబ్బంది తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లు భాను కిరణ్, మహేష్, ఎం.ఎఫ్ విజయ్ కుమార్, ఆయా డిపోల మేనేజర్లు ధరం సింగ్ (హనుమకొండ), శివ ప్రసాద్ (మహబూబాబాద్), ప్రసన్నలక్ష్మి (నర్సంపేట), ఇందు (భూపాలపల్లి), జ్యోత్స్న (వరంగల్–2), రవిచందర్ (పరకాల), అర్పిత (వరంగల్–1), ఎస్టిఐ రజిత రెడ్డి, ఆయా డిపోల సిబ్బంది మల్లికార్జున్, ఆర్ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.