calender_icon.png 26 January, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజన్ వ్యాధులపై ఆందోళన వద్దు

30-08-2024 01:53:23 AM

  1. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు 
  2. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): సీజన్ వ్యాధులు, డెంగ్యూపై ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అన్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధుల నివారణకు అన్ని రకాలు రక్త పరీక్షలు, అవసరమైన మందులు, సిబ్బంది, డాక్ట ర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి రాజనరసింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు నర్సింగ్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ పరీక్షలు చేయకుండానే ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రయివేట్ ఆసుపత్రులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధిపై జరుగుతున్న అసత్యపు ప్రచారంపై నిఘా పెట్టాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేను నిర్వహించి బాధితలు రక్త నమూనాలను సేకరించి వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజన్ వ్యాధుల కట్టడికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సీజనల్ రిపోర్టును సాయంత్రం 6 గంటల వరకు అందించాలన్నారు. పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్, గ్రామపంచాయతీలు, నీటిపారుదల, విద్యాశాఖ అధికారుల తో ప్రతి వారం సమీక్ష నిర్వహించి డెంగ్యూ కట్టడిపై జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలన్నారు. వ్యాధుల కట్టడిలో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయన్నారు.

జీవన్‌దాన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి.. 

అవయమార్పిడిపై పనిచేస్తున్న జీవన్‌దాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రోత్సహిం చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు మంత్రి రాజనరసింహ సూచించారు. జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా అవయమార్పిడిపై రూపొందించిన అంశాలపైన చర్చించారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, కమిషనర్ ఆర్వీ కర్ణన్,  హేమంత్ వాస్‌దేవ్, డాక్టర్ రవీందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.