09-08-2025 12:00:00 AM
హనుమకొండ, ఆగస్టు 8 (విజయక్రాంతి): గత ప్రభుత్వం చేయలేని పనులను ఒక్కొక్కటిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
అనేక పనికిమాలిన ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ పెట్టుకున్న దొంగ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. హనుమకొండ నగరంలోని బాలసముద్రం అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో శుక్రవారం మంత్రి పొంగులేటి ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి మొక్కను నాటారు.
అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో 592 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజ్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, నగర కమిషనర్ తో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వమని, తమ ప్రధాన లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడమేనని, నిరుపేదలు అధైర్య పడవ వద్దని ఈ ప్రక్రియ దశలవారీగా కొనసాగిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు మిత్తిలు వాయిదాలు చెల్లిస్తూ సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెడ్ల లాగా నడిపిస్తూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, జిల్లా గ్రంథాలయాలు చైర్మన్ అజీజ్ ఖాన్, కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ పాల్గొన్నారు.
ఇండ్ల కేటాయింపులో అన్యాయం చేశారంటూ ఆందోళన
హనుమకొండ అంబేద్కర్ నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ పేరు కేటాయించిన లిస్టులో ఉండేదని, ఇప్పుడు తమ పేర్లు గల్లంతయ్యాయని దీనికి గల కారణం ఏంటో తమకు తెలియట్లేదని వాపోయారు.
తమకు పార్టీలతో సంబంధం లేదని, గత 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకుని నివసించామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామంటే గుడిసెలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలలో అద్దె గదులలో నివసిస్తున్నామని చెప్పారు. తమ పేర్లు లిస్ట్‌లో లేవని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అధికారులు చెపుతున్నారని పేర్కొన్నారకు. తమ గోడును ఆలకించి దయతో తమకు ఇండ్లు కేటాయించాలని మొరపెట్టుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.