calender_icon.png 17 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లను అనుమతించొద్దు

17-06-2025 12:48:22 AM

- జీబీ లింక్ ద్వారా 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ ప్రణాళిక

- ప్రాజెక్టు ఆలోచనే నిబంధనలకు విరుద్ధం

- కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పాదించిన గోదావరి లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖ రాశారు.

జీబీ లింక్ ప్రాజెక్టును జూన్ 17న జరిగే నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) 33వ సమావేశంలో పరిశీలించనున్న నేపథ్యంలో..ప్రాజెక్టును ఆమోదించకూడదని ఈ లేఖలో కోరారు. ఈ లింక్ ద్వారా గోదావరి వరద నీటిలో 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ ప్రణాళిక అని, ఇది 1980నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీఏ) నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

గోదావరి, కృష్ణా నదుల బేసిన్‌లలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తోందని.. వాటాదారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను విస్తరించడంతో వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఈ లింక్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయగా..జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తుందని హామీ ఇచ్చిందని వివరించారు.

తాజాగా ఏపీ సమర్పించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను (పీఎఫ్‌ఆర్) సీడబ్ల్యూసీ జూన్ 11న కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ మండళ్లు (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) సహా ఇతర వాటాదారులకు అభిప్రాయాల కోసం పంపిందన్నా రు. ఈ లింక్ ప్రాజెక్టు వరద నీటి పేరిట అక్రమంగా నీటిని వినియోగించేందు కు ఎంచుకున్న మార్గమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఆలోచనే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందన్నారు.

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘిస్తూ, విస్తరణలు చేయడం వల్ల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతంలో పని నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రాజెక్టు వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని..2022 సెప్టెంబర్ 6న న్యాయ స్థానం ఈ విషయంలో పలు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు.

విస్తరణపై సాంకేతిక నివేదికలు, పర్యావరణ అనుమతులపై స్పష్టత అవసరమని, వాటాదారుల సమావేశం నిర్వహించాలని అప్పటి ఉత్తర్వులు సూచించాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జూన్ 17న జరగబోయే ఈఏసీ సమావేశంలో ప్రాజెక్టుకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) మంజూరు చేయకుండా పూర్తిగా తిరస్కరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే అనుమతుల ఉల్లంఘనలతో భారీ మార్పులు జరిగాయ ని, కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలు పెంచిన విషయాన్ని వివరిస్తూ ఏపీ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకూడదని ఆయన తన లేఖలో కోరారు..