13-08-2025 01:24:45 AM
- కోర్టులను సాకుగా చూపొద్దు
- పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించాలి
- ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, కోర్టులను సాకుగా చూపి కాలయాపన చేయవద్దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేస్తే, ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
మంగళవారం బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నందగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. బీసీ బిల్లుల అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటంతో పాటు, అవసరమైతే న్యాయపోరా టం కూడా చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే మాండమస్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.
జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ, .. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వా నికి ఉందన్నారు. దీనికి అనుగుణంగానే అసెంబ్లీలో చట్టం చేశారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి, నీలం వెంకటేష్, ముల రామకృష్ణ, సుధాకర్, అంజి, కరుణ, కవిత, సతీష్, హరి, శివ, మణికంఠ, బాలయ్య పాల్గొన్నారు.