01-10-2025 12:57:11 AM
ప్రముఖులకు హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ప్రముఖులెవరూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయవద్దు అని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపు తామని ఆయన స్పష్టం చేశారు. ఆడపిల్లల జోలికి వెళ్లేముందు ఇంట్లో ఉన్న తల్లి, చెల్లిని గుర్తు తెచ్చుకోవాలని, లేదంటే అలాంటి వారికి తగిన ట్రీట్‌మెంట్ ఇస్తామని చెప్పారు.
మంగళవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కార్యాచరణ ప్రణాళికను, ప్రాధాన్యతలను ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు. తనకున్న అనుభవంతో, టీం వర్క్‌తో నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచుతానని సజ్జనార్ అన్నారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈగల్ టీంను మరింత బలోపేతం చేసి, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ రక్కసిని అంతం చేస్తామన్నారు. వృద్ధులే లక్ష్యంగా సైబర్ మోసాలు పెరిగాయని, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని రోడ్ టెర్రరిస్టులుగానే పరిగణిస్తామన్నారు. వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
కల్తీ ఆహారంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ అనే నూతన కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తామని, ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని కోరారు.
మహిళల భద్రతకే అగ్ర ప్రాధాన్యం..
చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. మహిళల జోలికి వస్తే చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రజలకు తను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాన ని భరోసా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని, రౌడీ షీటర్లు జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.