01-07-2025 02:10:44 AM
- షెడ్యూల్ 5 ప్రకారం గిరిజనుల హక్కులు కాపాడండి
- కేంద్ర మంత్రి జువల్ ఓరామ్‌కు మాజీ ఎంపీ సోయం వినతి
ఆదిలాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): ఆదివాసీ లను అడవుల నుండి దూరం చేసే జిఓ 49 ను రద్దుచేసి, హరితహారం పేరిట పోడు భూముల్లో మొక్కలు నాటడం మానుకోవాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు కేంద్ర ప్రభుత్వాన్నీ కోరారు. సోమవారం న్యూఢిల్లీ లో గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరామ్ ను కలిసి తెలంగాణలో ఆదివాసీల సమస్యలను, ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు, జీవో 49 అంశాలపై చర్చించి వినతి పత్రం సమర్పించారు.
టైగర్ కన్జర్వేషన్ పేరిట ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా ను అడవుల నుండి గిరిజనులను దూరం చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మిగతా టైగర్ జోన్ లలో గిరిజనులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో జీవో 49 కారణంగా 339 గ్రామాల ప్రజలపై పెను ప్రభావం చూపుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాపాడుతూనే అటవీ భూముల్లో హరితహారం పేరిట మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఆపివేయాలని మంత్రిని కోరారు. రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీలోని షెడ్యూల్ ఏరియాలో గిరిజనుల హక్కులకు భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసి గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
గిరిజనులు, గిరినేతరులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు అందించేలా చూడాలని కోరారు. దింతో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం అని మంత్రి జువల్ ఓరామ్ హామీ ఇచ్చారని మాజీ ఎంపీ తెలిపారు. ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చేటప్పుడు బహిరంగ విచారణ పేరుతో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు సోయం బాపూరావు పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూలంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు వివరించారు. త్వరలోనే తెలంగాణలో పర్యటించి గిరిజనుల స్థితిగతులపై పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారన్నారు.