calender_icon.png 2 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోబే కొండల్లో ఎగురుతున్న డ్రోన్లు

02-05-2025 01:14:32 AM

మావోయిస్టుల కోసం బలగాల జల్లెడ 

కదలికలు పసిగట్టేందుకు సెల్ టవర్

సెల్ టవర్‌తో మావోయిస్టులకు చిక్కులు?

చర్ల, మే 1: తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో సుమారు 250 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతకు భద్రతాబలగాలు జల్లెడ పట్టినా మావోయిస్టుల జాడ లభించలేదు.

భద్రతాబలగాలు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కర్రెగుట్టల్లోని దోబే కొండల ప్రాంతం తర్వాత ఎత్తున కొండలు, ఇంకా దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటి ని దాటాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెలికాప్టర్ సహాయంతో డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. 

అబుజ్‌మడ్ నుంచి కర్రెగుట్టల వైపు..

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్ మడ్ అడవులు మావోయిస్టులకు అనువైన ప్రాంతంగా ఉండేవి. ఆ ప్రాంతంలోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామం పూవర్తి ఉండేది. అయితే పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుని, అక్కడే భద్రతా బలగాలు  పోలీస్ బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని వదిలి కర్రెగుట్టల వైపు వచ్చినట్లు తెలుస్తున్నది.

అయితే వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలి గిరిజన ఆదివాసీలు మరణించారో అప్పటినుంచి మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల్లోకి రావద్దని, ఈ ప్రాంతంలో బాంబులు అమర్చామంటూ లేఖలు విడుదల చేస్తూ హెచ్చరించారు.

కానీ అంతకంటే ముందే ఈ ప్రాంతాన్ని వదిలి మరో దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లిపోయినట్లు భద్రతా బలగాల మోహరింపులతో స్పష్టంగా అర్థమవుతున్నది. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆచూకీ పది రోజులైనా లభ్యం కాకపోవడం కూడా ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది. 

పూజారికాంకేర్‌లో సిగ్నల్ టవర్ 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పూజారి కాంకేర్‌లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం‘నియాద్ నెల్లా నార్’ పథకం కింద జియో సిగ్నల్ మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో బీజాపూర్ జిల్లాలోని గుంజెపర్తి, పూజారికాంకేర్, చింగన్పల్లి, నేలకాంకేర్, కమలాపూర్ వంటి మారుమూల గ్రామాలకు మొబైల్  కమ్యూనికేషన్ ఏర్పడింది.

మావోయిస్టు ప్రభావితమైన పూజారికాంకేర్‌లో టవర్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులకు మరో చిక్కు మొదలైనట్టుగా అర్థమవుతుంది. మావోయిస్టులు ఫోన్‌ల ద్వారా కమ్యూనికేట్ అయితే భద్రతా బలగాలు ఆ ప్రాంత సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అత్యాధునిక సిగ్నల్స్ వ్యవస్థతో మావోయిస్టుల కదలికలు కనిపెట్టే అవకాశం ఉంది. 

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బస్తర్, దంతేవాడలో ప్రభుత్వం నిర్వహిస్తున్న  లోన్ వర్రాటు (ఇంటికి తిరిగి రండి) పథకానికి ఆకర్షితులైన ఆరుగురు మావోయిస్టులు గురు వారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కడ్తి దేవా, లకే కుద్హం, మిత్లేష్ అలియాస్ ముద్ద, పగ్ను వెకో, మష్రం రామ్ కడ్తి, భీమ్సేన్ ఓ యం ఉన్నారు.