calender_icon.png 2 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ x రాహుల్

02-05-2025 01:12:45 AM

  1. కులగణనతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు కమలనాథుల వ్యూహం
  2. ఓబీసీలకు మరింత చేరువయ్యేలా ప్రణాళిక
  3. బీహార్, తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా అడుగులు
  4. ప్రభుత్వ ప్రకటనను తాము సాధించిన విజయంగా కాంగ్రెస్ నేతల ప్రచారం
  5. రిజర్వేషన్ల పెంపు విషయంలో కమల దళాన్ని ఇరుకున పెట్టేందుకు కసరత్తు 

న్యూఢిల్లీ, మే 1: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రుక్ చేస్తుందని దేశ ప్రజలు చూస్తుండగా.. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యాంగ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనూహ్యంగా కులగణనకు ఆమోదముద్ర వేసింది.

జనగణన తోపాటే దేశవ్యాప్తంగా కులగణను నిర్వహిస్తామని ప్రకటించటంతో కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం రాజకీయంగా సర్జికల్ స్ట్రుక్ చేసినట్లయింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ ప్రకటనను తాము సాధించిన విజయంగా ప్రచారం చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఓబీసీలకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వం కులగణన ప్రకటన చేసిందా? లేక రాజకీయ లబ్ధి కోసం చేసిందా? ఈ అంశం చివరికి ఎవరికి ప్రయోజనం చేకూర్చుతుందనే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. 

కాంగ్రెస్‌కు కళ్లెం వేసేందుకే..

కులగణన పేరుతో దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌కు కళ్లెం వేయడంతో పాటు కొద్దిరోజుల్లో జరగబోయే బీహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, అలాగే ఆ తర్వాత జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందడంలో భాగంగానే కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.

బీహార్ సహా యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కుల సమీకరణాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాగే తమిళనాడు ఎన్నికల్లో కూడా కులం అంశం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. భారత్ జోడో యాత్రంలో భాగంగా రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని లేవనెత్తారు. కులగణన ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని పేర్కొన్నారు.

2019 ఎన్నికలతో పోల్చితే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను కోల్పోగా, కాంగ్రెస్ 52 సీట్లను అదనంగా పొందింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 36 సీట్లకే పరిమితమైంది. దీంతో కాషాయ నేతలు కలవరపాటుకు గురైనట్టు తెలుస్తోంది. కులగణనపై కేంద్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నట్టు అనిపించినా ప్రధాని మోదీ మూడోసారి అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే బీహార్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కులగణనకు ఆమోదం తెలిపి, ఎన్నికల్లో కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలకు ప్రచార అస్త్రాం లేకుండా చేసింది. పనిలోపనిగా కులగణను కాంగ్రెస్ రాజకీయ లబ్ధికోసమే ఉపయోగించుకుందనే భావనను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి, హస్తం పార్టీకి బలహీనవర్గాలను దూరం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. 

బీజేపీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ అడుగులు

కులగణనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కాంగ్రెస్ తాను సాధించే విజయం గా విస్త్రృతంగా ప్రచారం చేసుకుంటోంది. ‘రాహుల్ గాంధీ ప్రతిపాదిం చారు. రేవంత్‌రెడ్డి అమలుచేశారు. నరేంద్రమోదీ అనుసరిస్తున్నారు’ అనే సందే శాన్ని వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చిన కులగణన అంశాన్ని తాము లాగేసుకున్నట్టు బీజేపీ నేతలు భావిస్తుండగా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టే దిశగా కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కులగణన చేశామనే ఘనతను బీజేపీ తన ఖాతాలో వేసుకునేలోపే అందుకు సంబంధించిన డేటాను విడుదల చేయాలని కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ వెంటనే రిజర్వేషన్ల విషయంలో 50శాతం పరిమితిని ఎత్తేసి, కులగణనలోని డేటా ప్రకా రం రిజర్వేషన్లను పునరుద్ధరించేలా ప్ర భుత్వంపై ఒత్తడి చేసేందుకు హస్తంపార్టీ నేతలు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మెడలు వంచి కులగణనతోపాటు రిజర్వేషన్ల పెంపును సాధించామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.