25 March, 2026 | 2:08 AM

డ్రగ్ కేసు విచారణ వేగవంతం

25-03-2026 12:38 AM
  1. తెరపైకి అభిషేక్, రాజేష్ వర్మ పేర్లు
  2. పోలీసుల దాడుల నుంచి తప్పించుకున్న అభిషేక్
  3. రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్ వాంగ్మూలం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్‌రెడ్డి, షూటర్ నమిత్ శర్మలను కస్టడీలోకి తీసుకున్న సిట్.. విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో పార్టీ లో పాల్గొన్న బెంగళూరు వ్యాపారి కౌశిక్ రవి తాను సిమ్లా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి వ్యక్తుల ద్వారా కొకైన్ తెప్పించానని పోలీసులకు చెప్పాడు.

రోహిత్‌రెడ్డి డ్రైవర్ శరత్ ఇచ్చిన వాంగ్మూలం పోలీసులను నివ్వెరపోయేలా చేసింది. డ్రగ్స్ పార్టీ కోసం నగరానికి చెందిన ప్రముఖ పెడ్లర్ అభిషేక్ సింగ్ నుంచే తాను స్వయం గా డ్రగ్స్ తెచ్చానని, గతంలోనూ పలుమార్లు రోహిత్‌రెడ్డి కోసం అభిషేక్ నుంచి మత్తు పదార్థాలు సేకరించినట్లు శరత్ అంగీకరించాడు. నగరంలో డ్రగ్స్ సరఫరాలో అభిషేక్ సింగ్ ఒక ప్రధాన కీలిక అని పోలీసులు గుర్తించారు.

అయితే, ఇతనికి డ్రగ్స్ సరఫరా చేసేది రాజేష్ వర్మ అని, అతనికి అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ మాఫియా తో సంబం ధాలున్నాయని సమాచారం. విదేశాల నుం చి వివిధ మార్గాల్లో డ్రగ్స్ తెప్పించి అభిషేక్ సింగ్ వంటి లోకల్ పెడ్లర్ల ద్వారా ప్రముఖులకు చేరవేస్తుంటాడని పోలీసుల విచారణ లో తేలింది. డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడటంతో, తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అభిషేక్ సింగ్ ఈ నెల 16 నుంచి అదృశ్యమయ్యాడు.

ఆశ్చర్యకరంగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ అభిషేక్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పో లీసులపై కాల్పులకు తెగబడిన ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ విచారణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కాల్పులు జరపమని రోహి త్‌రెడ్డి అతన్ని ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మూడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మలను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో డీసీపీ యోగేష్ గౌతమ్ బృందం ఒక రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తోంది. కాల్పుల కోసం వాడిన లైసెన్స్‌డ్ తు పాకీ ఎవరిది.. పార్టీ కోసం భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అన్న కోణంలో విచారణ సాగుతోంది.