21-11-2025 12:00:00 AM
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పొలిమేర మూవీ సిరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా పనిచేస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్. నవంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను అల్లరి నరేశ్ విలేకరులతో పంచుకున్నారు.
ఒక కొత్త జానర్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఇప్పటివరకూ సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. హైదరాబాద్‌లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా తీ సిన సినిమా ఇది. సినిమాకు తగ్గట్టుగా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశాం. ఇందులో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది.
అనిల్ కథ చెప్పినప్పుడు ఇంటర్వెల్‌లో షాక్ అయ్యాను. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనిపించింది. ఈ సినిమాలో మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. చాలా మైండ్ గేమ్ ఉంటుంది.
ఇలాంటి స్క్రీన్‌ప్లేతో తెలుగులోచాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా గురించి చర్చిస్తారు. నా కెరీర్‌లో ఒక మంచి సినిమా అనే స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందన్న నమ్ముతున్నా.
ఇది 12ఏ అనే ఇంట్లో జరిగే కథ. 12ఏ అనేది ముందే ఫిక్స్ అయ్యాం. తర్వాత ఏ కాలనీ పెట్టాలి అనుకున్నప్పుడు అనిల్ రైల్వే కాలనీ పెడితే అందరికీ కనెక్టింగ్‌గా ఉంటుందన్నారు. ఇది ఒక రైల్వే కాలనీ బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది. ఈ కథకు టైటిల్ పర్ఫెక్ట్.
ఇది వరంగల్‌లో జరిగే కథ. తెలంగాణ యాస కోసం అజయ్ అనే ఒక వ్యక్తి వచ్చారు. తనతో వర్క్‌షాప్ చేశాను. ఫస్ట్ టైమ్ తెలంగాణ యాస మాట్లాడుతున్నా. చాలా శ్రద్ధ తీసుకున్నా. నేను ప్రతి సినిమాకూ దాదాపు ఒక రోజులో డబ్బింగ్ చెప్పేస్తా. కానీ ఈ సినిమాకు నాలుగు రోజులు పట్టింది. ప్రతి డైలాగ్ చెక్ చేసుకుంటూ యాస సరిగ్గా పలికేలా కేర్ తీసుకున్నా.
ఈ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. అక్కడ ఒక లోకల్ ఎమెల్యే దగ్గర పని చేస్తుంటాను. స్థానికంగా తలలో నాలుకలాంటివాడు కార్తీక్. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. సరదాగా జరిగిపోతున్నప్పుడు ఒక సంఘటన ఎదురవుతుం ది. ఆ సంఘటన తన జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుందనేదే మిగతా కథ.
నా నుంచి రాబోయే కొత్త సినిమాల్లో ‘-ఆల్కహాల్’ జనవరిలో రిలీజ్ ఉంటుంది. హాస్య, అన్నపూర్ణ బ్యానర్‌లో ఒక సినిమా ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. జనవరి నుంచి మరో కొత్త సినిమా ప్రారంభిస్తాం. ఈ రెండూ మంచి కామెడీ సినిమాలు.