21-11-2025 12:00:00 AM
అఖిల్‌రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందున ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “చాలా దారుణాలు విన్నా, ఈ సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యా. ఈ సినిమాను అందరి కంటే ముందు ఇన్నేళ్లు ప్రేమకథను దాచిపెట్టిన ఆ ఊరి వాళ్లు ఫస్ట్ చూడాలి” అన్నారు.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో మా మూవీ క్లుమైక్స్ గురించి మీమ్స్ పెడుతున్నారు. అలాంటి క్లుమైక్స్ మా సినిమాలో ఉండదు” అని చెప్పారు. ‘ఈ సినిమా మీ గుండెల్ని హత్తుకుని ఆలోచింపజేస్తుంద’ని హీరోయిన్ తేజస్విని తెలిపింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్లు తరుణ్ భాస్కర్, సాయి మార్తాండ్, చిత్రబృందం పాల్గొన్నారు.
నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా: డైరెక్టర్ సాయిలు
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ.. “ఇది ఊరి కథ అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. అవును నేను ఊరోడినే. నా ఊరంటే నాకు ప్రేమ, ఆ ఊరిలో ఉండే మనషులు ఇష్టం. అక్కడి కథలతోనే సినిమాలు రూపొందిస్తా. నచ్చకుంటే లైట్ తీసుకోండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట చౌరాస్తాలో అర్ధనగ్నంగా తిరుగుతా.
15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమకథ ఇది. ఈ సినిమా కోసం నేనూ మా టీమ్ పగలూ రాత్రీ కష్టపడ్డాం. ఆ బాధతో చెబుతున్నాం నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు మీ ఊరు గుర్తుకొస్తుంది” అన్నారు.