30-01-2026 12:28:40 AM
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ టౌన్, జనవరి 29 : రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఎన్ జి కాలేజ్ నుండి రామగిరి, క్లాక్ టవర్ వరకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని, అనేక కుటుంబాలు పేదరికంలోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ వాడాలని సూచించారు. యువత ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. తదుప ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని అన్నారు. ఒక్క క్షణ నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపంగా మారుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తే సురక్షిత జీవనానికి మార్గమని పేర్కొన్నారు. జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ . వాణి, డిటివో లావణ్య, డీఎస్పీ శివరాం రెడ్డి, ఎం వి ఐ కొండయ్య, మల్లికార్జున్ రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.