02-01-2026 12:47:18 AM
నరక యాతన అనుభవిస్తున్న భక్తులు.
నాగర్ కర్నూల్, జనవరి 1 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని చందాయపల్లి శివారు ప్రాంతంలో రైతులు స్వయంగా నిర్మించిన శ్రీ హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన రైతులు భక్తిశ్రద్ధలతో పశుపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దుల బండ్లకు పూజలు చేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, డంపింగ్ యార్డు వైపు వెళ్లే వాహనాల రాకపోకల కారణంగా చందాయపల్లి ప్రధాన రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
దీంతో పంట పొలాలకు వెళ్లే రైతులు తమ ద్విచక్ర వాహనాలను వదిలి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయ సమీపంలోని డంపింగ్ యార్డ్ మాదిరి పట్టణంలో సేకరించిన చెత్తాచెదారాన్ని పడేయడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతోంది. రాబోయే సంక్రాంతి పండుగ నాటికి ఈ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.