27-05-2025 01:21:51 AM
- మేనేజ్‌మెంట్ కోటా ఇంజినీరింగ్ సీట్ల దందా షురూ
- డబ్బులు కట్టించుకొని సీట్లను బ్లాక్ చేస్తున్న కాలేజీలు
- మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
- అకడమిక్ ప్రారంభమవుతున్నా పెండింగ్
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కొన్ని పేరున్న ప్రైవేట్ కాలేజీలు ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల దం దాకు అప్పుడే తెరలేపాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఆయా కాలేజీలు నిజం చేస్తున్నాయి. డిమాం డ్ ఉన్న కోర్సులకు సంబంధించిన సీట్లను అప్పుడే అమ్మేసుకుంటున్నాయి.
జేఈఈ మెయిన్, ఎప్‌సెట్ లో మంచి ర్యాంకులు రాని విద్యార్థుల తల్లిండ్రులు రాష్ట్రంలోని పేరున్న కాలేజీ ల్లో సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పేరెంట్స్ ప్రయత్నాలను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని కాలేజీలు సీట్లను రిజర్వ్ చేసు కోవాలని మభ్యపెడుతున్నాయి.
తర్వాత వస్తే సీట్లుండవని, ఇప్పుడే కొంత మొత్తం అడ్వా న్స్ కింద కట్టుకుంటే సీట్లను రిజర్వ్ చేసి ఉంచుతామని నమ్మబలుకుతున్నాయి. దీం తో చేసేదిలేక కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతోకొంత డబ్బులు అడ్వాన్స్ రూపంలో కడుతున్నారు. అడ్వాన్సుల కింద కొన్ని కాలేజీలు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమచారం.
కౌన్సిలింగ్‌కు ముందే..
2024 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,12,069 ఇంజినీరింగ్ సీట్లున్నాయి. అయితే ఇందులో 70 శాతం సీట్లను ఎప్‌సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద నింపుతారు. ఇదంతా కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చాకే భర్తీ చేయాలి.
అందులోనూ తొలుత కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేసిన తర్వాతే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవ్వకముందే కొన్ని ప్రైవేట్ కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటున్నాయి. ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు సైతం ఖరారు కావాల్సి ఉంది.
వీటిపై ఎలాంటి స్పష్టత రాకముందే కాలేజీలు తమ దందాకు తెరలేపాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియెల్ ఇంజినీరింగ్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉండటంతో ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టు విద్యావర్గాల సమాచారం. వచ్చే నెలలో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.
ఆన్‌లైన్‌లో భర్తీపై నిర్ణయం తీసుకోని సర్కార్...
మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఒక్కో కాలేజీ తమ ఇష్టానుసారంగా అమ్మేసుకుంటున్నా యి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు ఎక్కు వ డబ్బులిస్తే వారికే అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో కొంతమంది పేరెంట్స్ ఎంతో కొంత కట్టి సీటు కొనుగోలు చేసేందుకు కాలేజీలను సంప్రదిస్తున్నాయి.
అయితే వీరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవారికే ఆయా కాలేజీలు సీట్లను విక్రయిస్తుండటంతో తాము సీట్లు పొందలేకపోతున్నామనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. మరోవైపు ఇష్టానుసా రంగా సీట్ల అమ్మకాలను కట్టడిచేయాలంటే నీట్ తరహాలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లనూ ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ఎంతో కొంత ఫీజును ఖరారు చేసి ఆ ఫీజులను భర్తీ చేయాలని పేర్సెంట్ కోరుతున్నారు. ఈ డిమాండ్లకు అనుగుణంగానే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్కార్‌కు తెలంగాణ ఉన్నత విద్యామండలి గతేడాది లేఖ రాసింది. ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ సీట్లనూ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తామని అందులో పేర్కొంది.
అయితే, దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉంది. ఇది పాలసీ వ్యవహరమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే ఎప్‌సెట్ ఫలితాలు విడుదలైనా, ఇంకా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకొని సీట్ల దందాకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 70 శా తం సీట్లను ఈఏపీ సెట్ ర్యాంకుల ద్వా రా భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద నిం పాలి. ఈ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను విదార్థికి వచ్చిన ఎప్‌సెట్ ర్యాంకు, జేఈఈ ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనల మేరకు సీట్లను కేటాయించాలి. దీంతోపాటు ఈ కోటాలోనే నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) కోటా ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇక ఎప్‌సెట్ ద్వారా నింపే సీట్లన్నీ ప్రభుత్వమే నిబంధనల ప్రకారం విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్లకు అనుగుణంగా నింపుతున్నారు. కానీ, మేనేజ్ మెంట్ కోటా సీట్లను మాత్రం ఆయా కాలేజీలే భర్తీ చేసుకునేలా ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో మేనేజ్‌మెంట్లకు అది అనుకూలంగా మారింది.