05-09-2025 01:36:43 AM
-రెండు నియోజకవర్గాల్లో కోట నీలిమ పేరుందని ఆరోపణలు
-సెప్టెంబర్ 10లోపు వివరణ ఇవ్వాలన్న ఈసీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: సీడబ్ల్యూసీ సభ్యు డు, కాంగ్రెస్ మీడియా విభాగం ఇంచార్జి పవన్ పవన్ ఖేరా సతీమణి కోట నీలిమ పేరు రెండు నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలో ఉందని అధికార బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. రెండు రోజుల ముందు ఇదే విధంగా పవన్ ఖేరాకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది.
నీలిమకు న్యూఢిల్లీ అసెంబ్లీతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీలోకి కూడా ఓటు హక్కు ఉందని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 10లోపు ఈ ఆంశంపై వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. ‘మీ పేరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పేరు నమో దు చేసుకోవడం ప్రజాప్రాతినిథ్య చట్టెం 1951 ప్రకారం శిక్షార్హమైన నేరం అనే విషయంలో మీకు అవగాహన ఉంటుంది.
ఆ చట్టం ప్రకారం మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదో మీరు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే పవన్ ఖేరాకు కూడా ఇదే విధమైన నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేస్తున్న సమయంలో బీజేపీ కాంగ్రెస్‌లో ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారి వివరాలను బహిర్గతం చేస్తోంది. ఈ నోటీసులపై పవన్ ఖేరా స్పందించారు.
ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా పని చేస్తుందని ఈ ఆంశంతో మరోసారి నిరూపితం అయిందని ఆరోపించారు. కోట నీలిమ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 2023లో హైదరాబాద్‌లోని సనత్ నగర్ అసెంబ్లీ నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.